Thirupparankundram Karthigai Deepam

తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై కార్తిక మహాదీపం ఎట్టకేలకు వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు కొండపై ఉన్న రాతిస్తంభంపై దీపాన్ని వెలిగించారు. ఆలయ దీప మండపంపై వెలుగుతున్న జ్యోతి నుంచి అగ్నిని తీసుకొచ్చి ఈ క్రతువును(Thirupparankundram Karthigai Deepam) పూర్తి చేశారు. ఇందుకోసం 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల వత్తి, ఐదు కిలోల కర్పూరాన్ని వినియోగించారు. సీఆర్పీఎఫ్‌ బలగాల పటిష్ఠ భద్రత నడుమ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ వైద్యనాథన్‌, జస్టిస్‌ పార్తిబన్‌, జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌ కృష్ణ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా కొండపైకి కేవలం 50 మందిని మాత్రమే అనుమతించారు. సిక్కందర్‌ దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని బఫర్‌ జోన్‌గా ప్రకటించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చెందిన ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయ సమీపంలోని దీప మండపంపై ఏటా కార్తిక మహాదీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కొండపై ఉన్న సిక్కందర్‌ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై కూడా దీపం వెలిగించాలనే డిమాండ్‌తో కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. గతేడాది మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం రాతిస్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. ఈ ఏడాది నవంబర్‌ 20న రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ కార్తిక పౌర్ణమి రోజున పాత పద్ధతిలోనే దీప మండపంపై మహాదీపాన్ని(Thirupparankundram Karthigai Deepam) వెలిగించడంతో వివాదం మళ్లీ రాజుకుంది. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, శనివారం రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాతిస్తంభంపై కార్తిక మహాదీపం వెలిగించారు.