Andhra Pradesh Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కూటమి పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తొలి విడత ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

2600 పంచాయతీల్లో పాగా వేసిన కూటమి

తొలి విడతలో ఎన్నికల ప్రక్రియ చేపట్టిన 3,949 పంచాయతీల్లో 760 స్థానాలను కూటమి మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. గురువారం పోలింగ్ జరిగిన పంచాయతీల్లోనూ కూటమి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం కూటమి బలపరిచిన అభ్యర్థులు 2,600కు పైగా స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ మద్దతుదారులు వెయ్యికి చేరువలో విజయాలు నమోదు చేశారు. స్వతంత్రులు, ఇతర అభ్యర్థులు కూడా వందకు పైగా స్థానాల్లో విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కూటమి మద్దతుదారులు ఎక్కువ స్థానాలను సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది.

గత ఎన్నికల ఫలితాల ప్రభావం

ఇటీవల జరిగిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు గణనీయమైన ఫలితాలు సాధించాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో 94 శాతం, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 96.42 శాతం, మండల పరిషత్‌ ఎన్నికల్లో 95 శాతం స్ట్రయిక్‌ రేటు నమోదు చేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే ఫలితాల ధోరణి పంచాయతీ ఎన్నికల తొలి విడతలోనూ కనిపించింది. రోవైపు, పంచాయతీ ఎన్నికల తదుపరి విడతల నేపథ్యంలో టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి విడత ఫలితాలను సమీక్షించడంతో పాటు రెండో, మూడో విడత ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. తొలి విడతలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాలపై నేతలకు అభినందనలు తెలిపారు.

సమన్వయంతో ముందుకు సాగండి: మంత్రి లోకేశ్‌

2024 సార్వత్రిక ఎన్నికల నుంచి కొనసాగుతున్న విజయాల పరంపర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే విజయాలు సాధించామనే ధీమాతో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన, బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ నిర్వహణలో ముందుకు వెళ్లాలని లోకేశ్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గుర్తుచేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు చేస్తూ, ఎన్నికల సమయంలో ఘర్షణలు, దాడులు జరిగే అవకాశాలున్నాయని లోకేశ్ హెచ్చరించారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.