సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
AP Telangana Water Dispute: సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం

AP Telangana Water Dispute: నాగార్జునసాగర్ జలాశయం నుంచి తాగునీటిని తరలించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం మొదలైంది. సాగర్ డ్యామ్ కుడివైపున విజయపురి సౌత్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న తాగునీటి పథకంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. అయితే, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు తెలంగాణ చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టును గతంలో ఏపీ కూడా ఇదే తరహా కారణాలతో వ్యతిరేకించింది. ఈ రెండు ప్రాజెక్టులూ నాగార్జునసాగర్ జలాశయం నుంచే నీటిని తీసుకునేలా రూపొందించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాదనలు, ప్రాజెక్టుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి.
పల్నాడు వాటర్ గ్రిడ్.. ఏపీ లక్ష్యం ఇదీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి-పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. పల్నాడు, దర్శి, పర్చూరు ప్రాంతాల్లోని 33 మండలాల పరిధిలో ఉన్న 889 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. జల్‌జీవన్ మిషన్ కింద సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువకు కేటాయించిన నీటి వాటా నుంచే ఈ పథకానికి 1.865 టీఎంసీలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు 4న జీవో 453 జారీ చేసింది. విజయపురి సౌత్ వద్ద సుమారు 492 అడుగుల నీటిమట్టం నుంచి నీటిని తీసుకునేలా ఇన్‌టేక్ వ్యవస్థను రూపొందించారు. ఈ పథకంలో భాగంగా రోజుకు 160 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ కూడా సిద్ధమైంది. ఏడాది మొత్తానికి కేటాయించిన నీటిని లెక్కిస్తే, ఈ పథకం ద్వారా రోజుకు సుమారు 0.005 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇది దాదాపు 60 క్యూసెక్కులకు సమానం. ఈ నీటితో లక్ష్యంగా పెట్టుకున్న గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్‌కు నీటి సరఫరా కోసం సుంకిశాల ప్రాజెక్టు
మరోవైపు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టును చేపట్టింది. నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ జలాశయం నుంచి నేరుగా నీటిని తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఏఎమ్మార్పీ కాలువ ద్వారా హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న కృష్ణా జలాల మూడు దశలకు బదులుగా, నేరుగా జలాశయం నుంచే నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ఈ మూడు దశల ద్వారా రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. ఏడాదికి ఈ పరిమాణం సుమారు 16.5 టీఎంసీలుగా ఉంది. జలాశయంలో నీటిమట్టం 462 అడుగులకు పడిపోయినప్పటికీ నీటిని తోడుకునే సామర్థ్యంతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు 0.045 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 500 క్యూసెక్కుల నీరు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.2,215 కోట్లు. అయితే, 2024 ఆగస్టు 1న ఇన్‌టేక్ వెల్ రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయి.
నీటి తోడకంలో ఎనిమిది రెట్ల వ్యత్యాసం
రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను పరిశీలిస్తే, నీటి తోడకంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. ఏపీ చేపడుతున్న అమరావతి–పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా రోజుకు సుమారు 0.005 టీఎంసీల నీటిని తీసుకోనుండగా, తెలంగాణ సుంకిశాల ప్రాజెక్టు ద్వారా రోజుకు 0.045 టీఎంసీల నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ లెక్కన సుంకిశాల ప్రాజెక్టు ద్వారా తీసుకునే నీటి పరిమాణం ఏపీ పథకం కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. అయితే, ఏపీ పథకం 889 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకోగా, సుంకిశాల ప్రాజెక్టు హైదరాబాద్ మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. నీటిని తీసుకునే కనిష్ఠ స్థాయిలోనూ రెండు ప్రాజెక్టుల మధ్య వ్యత్యాసం ఉంది. ఏపీ పథకం సుమారు 492 అడుగుల నీటిమట్టం నుంచి నీటిని తీసుకుంటుంది. సుంకిశాల మాత్రం 462 అడుగుల వరకు నీటిమట్టం తగ్గినా నీటిని తోడుకునేలా నిర్మిస్తున్నారు. అంటే జలాశయంలో నీటి నిల్వలు మరింత తగ్గిన పరిస్థితుల్లోనూ సుంకిశాల ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది.
అనుమతుల విషయంలో రెండు రాష్ట్రాల భిన్న వాదనలు
ఈ రెండు ప్రాజెక్టుల చుట్టూ ప్రధానంగా అనుమతుల అంశమే వివాదానికి కారణమవుతోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిశీలన, కేంద్ర జల సంఘం అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ప్రాజెక్టులు చేపట్టవచ్చా లేదా అన్నది కీలక ప్రశ్నగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టు విషయంలో తాగునీటి అవసరాల కోసమే నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే ఉన్న నీటి వాటా నుంచే నీటిని తీసుకుంటున్నందున సమగ్ర ప్రాజెక్టు నివేదిక అవసరం లేదని వాదించింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని గతంలో ప్రశ్నించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విజయపురి సౌత్ వద్ద చేపడుతున్న పథకంపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. కేటాయింపులకు మించి నీటిని వినియోగించుకునేలా పనులు చేపడుతున్నారని, విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేఆర్ఎంబీని కూడా కోరారు. అయితే, తమకు ఇప్పటికే కేటాయించిన నీటి వాటా నుంచే తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకుంటున్నామని ఏపీ చెబుతోంది. కొత్తగా ఎలాంటి నీటి కేటాయింపులను కోరడం లేదని స్పష్టం చేస్తోంది.
తేలాల్సిన కీలక అంశాలు
నాగార్జునసాగర్ జలాశయం నుంచి తాగునీటిని తరలించే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు ఇప్పుడు పరస్పర అభ్యంతరాలకు కేంద్రంగా మారాయి. ఒక రాష్ట్రం తన ప్రాజెక్టుకు తాగునీటి అవసరాలను కారణంగా చూపుతుండగా, మరో రాష్ట్రం కూడా అదే వాదనను తన ప్రాజెక్టు విషయంలో వినిపిస్తోంది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అనుమతులు, డెడ్ స్టోరేజీ వినియోగం, నీటి తోడకంపై పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందితేనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు.



