Andhra Mandapam in Visakhapatnam: విశాఖ నగరానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు వేదికగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ఆంధ్ర మండపం నిర్మాణానికి సిద్ధమైంది. ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో కాపులుప్పాడ కొండపై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పటికీ నిరుపయోగంగా ఉండగా.. ఇప్పుడు విశాఖకు అంతర్జాతీయ స్థాయి సదస్సుల కోసం మరో భారీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది.

ఐటీ హబ్‌గా విశాఖ.. అంతర్జాతీయ సదస్సులే లక్ష్యం

విశాఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ పారిశ్రామిక సమావేశాలకు నగరాన్ని వేదికగా మార్చే లక్ష్యంతో ఆంధ్ర మండపం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కాపులుప్పాడ కొండపై 24 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 120 మీటర్ల ఎత్తులో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

5 వేల మందితో భారీ కన్వెన్షన్ హాల్

ఈ ప్రాజెక్టులో 5 వేల మంది కూర్చునే సామర్థ్యంతో భారీ కన్వెన్షన్ హాల్, 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక ఆడియో, విజువల్ టెక్నాలజీతో ప్రధాన ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల బస కోసం 250 గదులతో ఫోర్ స్టార్ హోటల్ నిర్మించనున్నారు. ఇందుకోసం 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కేటాయించారు. సమావేశాలు, ప్రదర్శనలు, బస.. ఇలా అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

సముద్ర అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం

ఆహ్లాదకరమైన పూలతోటలు, వాటర్ ఫౌంటెన్లు, సముద్ర అందాలను వీక్షించేలా వ్యూ పాయింట్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ ఏడు రకాల త్రీడీ నమూనాలను సిద్ధం చేయడంతో పాటు నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. వచ్చే ఏడాది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీభాగస్వామ్య సదస్సును ఈ కేంద్రంలో నిర్వహించేలా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రుషికొండ ప్యాలెస్ నిరుపయోగం.. ఆంధ్ర మండపంపై కొత్త ఆశలు

ఒకవైపు రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ ఇప్పటికీ నిరుపయోగంగా ఉండగా.. మరోవైపు విశాఖకు అంతర్జాతీయ సమావేశాలు, పారిశ్రామిక సదస్సులు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆంధ్ర మండపం నిర్మాణం చేపడుతోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విశాఖ ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టు నగరానికి మరో మణిహారంగా నిలవనుంది. అంతేకాకుండా ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర మండపం కీలకంగా మారింది..