AP Zilla Parishad Chairman List: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవుల పంపకంపై కూటమి పార్టీల మధ్య ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపి జిల్లాల వారీగా పదవులను పంచుకున్నారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చల్లో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధ, గురువారాల్లోనూ సమావేశాలు నిర్వహించి స్థానాల పంపకాన్ని ఖరారు చేశారు. మరోవైపు శుక్రవారం నాడు జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి.

జనసేనకు నాలుగు ఛైర్మన్‌ స్థానాలు.. బీజేపీకి ఒకటి

ఆంధ్రప్రదేశ్‌లోని 27 జిల్లా పరిషత్‌లలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఈ పంపకాల్లో జనసేనకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల ఛైర్మన్‌ పదవులు కేటాయించారు. తూర్పుగోదావరి, కోనసీమ, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాల వైస్‌ ఛైర్మన్‌ స్థానాలను కూడా జనసేనకు అప్పగించారు. బీజేపీకి కృష్ణా జిల్లా ఛైర్మన్‌ పదవితో పాటు ఎన్టీఆర్‌, తిరుపతి జిల్లాల వైస్‌ ఛైర్మన్‌ స్థానాలు కేటాయించారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ 22 ఛైర్మన్‌, 20 వైస్‌ ఛైర్మన్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యత కల్పించింది.

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల అభ్యర్థులు ఖరారు

శ్రీకాకుళం జిల్లా జడ్పీ వైస్‌ ఛైర్మన్‌గా గుంటు విజయ్‌కుమార్‌ ఎంపికయ్యారు. విజయనగరం ఛైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పసల నీరజ పేర్లు ఖరారయ్యాయి. పార్వతీపురం మన్యం వైస్‌ ఛైర్మన్‌గా వైరిచర్ల వీరేశ్‌చంద్ర దేవ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. విశాఖ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా అలివేణి, వైస్‌ ఛైర్మన్‌గా సుకవాసి అజయ్‌ ఎంపికయ్యారు. అనకాపల్లి వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పెంటకోట స్వాతికి అవకాశం కల్పించారు. పోలవరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా వంతల రాజేశ్వరి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా తీగల ప్రభ పేర్లను ఖరారు చేశారు. కాకినాడ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పిల్లి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా కాడ పద్మ, కోనసీమ ఛైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య బాధ్యతలు చేపట్టనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఛైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు, వైస్‌ ఛైర్మన్‌గా సిరగాని నాగేశ్వరరావు పేర్లు ఖరారయ్యాయి. ఏలూరు ఛైర్‌పర్సన్‌గా చింతమనేని సాయి నవ్యశ్రీ, వైస్‌ ఛైర్మన్‌గా బొర్రా చలమయ్య ఎంపికయ్యారు.

కోస్తా జిల్లాల్లోనూ అభ్యర్థుల ప్రకటన

కృష్ణా జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా దండమూడి పూజితకు అవకాశం దక్కగా, ఎన్టీఆర్ జిల్లా ఛైర్‌పర్సన్‌గా కోట పుల్లమ్మ ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ధార అరుణ, వైస్‌ ఛైర్మన్‌గా తల్లా అశోక్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పల్నాడు ఛైర్‌పర్సన్‌గా పుచ్చకాయల రమాదేవి, వైస్‌ ఛైర్మన్‌గా నల్లపాటి కీర్తన పేర్లు ఖరారయ్యాయి. బాపట్ల ఛైర్‌పర్సన్‌గా పుషడపు రోహిణిని ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కొక్కిలిగడ్డ ప్రభాకరరావు పేరు ప్రకటించారు. మార్కాపురం ఛైర్మన్‌గా కందుల రామిరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా జి.వి.శ్రీనివాసవర్మ ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

రాయలసీమ జిల్లాల్లో వీరికే అవకాశం

రాయలసీమ జిల్లాల్లోనూ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. కర్నూలు జిల్లా ఛైర్మన్‌గా చూడి ఉలిగయ్య, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా షేక్‌ షాదిక పేర్లు ఖరారయ్యాయి. నంద్యాల ఛైర్మన్‌గా షేక్‌ బ్రుహానుద్దీన్‌, వైస్‌ ఛైర్మన్‌గా కె.శ్రీకాంత్‌రెడ్డి ఎంపికయ్యారు. అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా గంజే నాగరాజు, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా వెన్నపూస లలితకు అవకాశం కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌ పేరు ఖరారైంది. కడప జిల్లా ఛైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా హబీబున్నీసా చాంద్‌బాయి ఎంపికయ్యారు. అన్నమయ్య జిల్లా ఛైర్మన్‌గా సుగవాసి ప్రసాద్‌బాబు, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా తలారి శరణ్య పేర్లను ప్రకటించారు. తిరుపతి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా హేమలత, చిత్తూరు ఛైర్‌పర్సన్‌గా మాదలం శైలజ ఎంపికయ్యారు. చిత్తూరు వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.మంజుప్రియ వెంకటేశ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇవాళ జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

మొత్తంగా మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తవడంతో జడ్పీ పీఠాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి రావడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. శుక్రవారం జరగనున్న ఎన్నికలతో కొత్త ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.