SCO సదస్సుకు పాక్‌కు ఆహ్వానం.. దేశీయ రాజకీయాల్లో పెను దుమారం
SCO Summit 2026: భారత్ వేదికగా జరుగుతున్న SCO సమ్మిట్‌కు పాకిస్థాన్‌ను ఆహ్వానించింది మోదీ సర్కార్. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.

SCO Summit 2026: పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం పంపడం ఇప్పుడు దేశీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. షాంఘై సహకార సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న SCO సివిలైజేషనల్ డైలాగ్ సదస్సుకు పాకిస్థాన్‌ను ఆహ్వానించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. దేశ రాజధానిలోని పురానా ఖిలా వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు ఈ సదస్సు జరగనుంది. తియాంజిన్‌లో SCO శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు భారత్ వేదికగా సదస్సు జరుగుతోంది. ఇందులో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపగా.. ఆ దేశం కూడా హాజరయ్యేందుకు అంగీకరించింది. దీంతో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే తొలిసారి
గతేడాది మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్యల అనంతరం పాకిస్థాన్‌కు మంత్రి స్థాయి ప్రతినిధి హాజరయ్యేలా భారత్ ఆహ్వానం పంపడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎస్సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపాల్సి ఉంటుందని, అందులో భాగంగానే పాకిస్థాన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 28న స్పష్టం చేసింది. ఈ సదస్సుకు తమ దేశం తరఫున వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరవుతారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎస్సీఓ వేదికగా సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంతో పాటు వివిధ నాగరికతల మధ్య చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని తమ దేశం భావిస్తున్నట్లు పేర్కొంది.
కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్
పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో మతం పేరుతో ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ దాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు ఏమిటని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి నిలదీశారు. SCO అనేది బహుళపక్ష వేదిక అయినప్పటికీ, ఇంతటి తీవ్ర ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సైతం ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
విపక్షాలకు బీజేపీ కౌంటర్
మరోవైపు కాంగ్రెస్ విమర్శలను బీజేపీ నేత దిలీప్ ఘోష్ తిప్పికొట్టారు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం పాకిస్థాన్‌కే ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. అక్కడ ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులు, సైనికులను హతమారుస్తున్నారని, దీంతో ప్రజలు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడం వంటి అంశాలపై SCO సభ్య దేశాలన్నీ ఒకే విధానాన్ని అనుసరించాలని భారత్ ఎప్పటి నుంచో చెబుతోందని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావులేకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నోటి దూల మంత్రిని పంపుతున్న పాకిస్థాన్
గతంలో సింధూ జలాల వివాదం సందర్భంగా భారత్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ముసాదిక్ మాలిక్‌నే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ సమావేశానికి పంపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముసాదిక్ మాలిక్ గతంలో సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌కు దక్కాల్సిన నీటి వాటాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అలాంటి వారి చేతులు నరికేస్తామనే హెచ్చరిక చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తినే ఇప్పుడు భారత్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు పాకిస్థాన్ ప్రతినిధిగా ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, గత నెలలో ఇస్లామాబాద్‌లో నిర్వహించిన SCO సన్నాహక సమావేశానికి భారత్ తరఫున సమన్వయకర్త అలోక్ డిమ్రి హాజరయ్యారు. తాజాగా ఢిల్లీలో జరగనున్న సదస్సుకు పాకిస్థాన్ మంత్రి హాజరుకానుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది.



