West Bengal Police Encounters: నేరం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం.. న్యాయస్థానంలో హాజరుపరచడం.. విచారణ అనంతరం నేరం రుజువైతే కోర్టులు శిక్ష విధించడం. ఇదే మన న్యాయవ్యవస్థలో అనుసరించాల్సిన సాధారణ ప్రక్రియ. కానీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నేరాల నియంత్రణ పేరుతో పోలీసుల చర్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు బుల్డోజర్ చర్యలు సంచలనం సృష్టిస్తే.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో వరుస ఎన్‌కౌంటర్లు కలకలం రేపుతున్నాయి.

యూపీలో బుల్డోజర్లు.. బెంగాల్‌లో తుపాకీ తూటాలు

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరగాళ్లపై కఠిన చర్యల పేరుతో బుల్డోజర్ చర్యలు విస్తృతంగా వార్తల్లో నిలిచాయి. నేరాలకు పాల్పడిన వ్యక్తుల అక్రమ నిర్మాణాలు, ఆస్తులపై బుల్డోజర్లు ప్రయోగించడం రాజకీయంగానూ, న్యాయపరంగానూ పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు పోలీసుల ఎన్‌కౌంటర్లు కూడా అక్కడ తరచూ కేరాఫ్‌ హెడ్‌లైన్‌గా నిలిచింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనూ పోలీసుల చర్యలు చర్చనీయాంశంగా మారాయి. బెంగాల్‌లో సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు మాత్రం ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని చెబుతున్నట్లు సమాచారం.

నాలుగు నెలల్లో ఐదు ఎన్‌కౌంటర్లు.. బెంగాల్‌లో ఏం జరుగుతోంది..?

గత నాలుగు నెలల వ్యవధిలో ఐదు ఎన్‌కౌంటర్ ఘటనలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో చర్చకు కారణమైంది. ఒక్కో ఘటన వెనుక ఒక్కో నేర నేపథ్యం ఉన్నప్పటికీ.. పోలీసుల కాల్పుల్లో నిందితులు మరణిస్తుండటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుజిత్ మండల్ హత్య కేసు నుంచి అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఘటనల వరకు పోలీసుల చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ క్రమంలో సమౌన్ షేక్, గైఘాటాకు చెందిన ప్రహ్లాద్ దాస్, దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన ప్రభాస్ మండల్ అత్యాచారం, హత్య కేసులో రతన్ షేక్ ఎన్‌కౌంటర్ వంటి పేర్లు ఇప్పుడు బెంగాల్‌లో ఉన్న నేరగాళ్లకు, టీఎంసీ నేతలకు భయం పట్టుకుంది.

నేరస్థులకు బెంగాల్‌లో చోటు లేదు: సీఎం సువేందు

పోలీసుల ఎన్‌కౌంటర్‌పై సీఎం సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపినందునే పోలీసులు అక్కడ చేయాల్సిన పని చేశారని, ఈ ఘటనపై తాను వ్యాఖ్యానించడం సముచితం కాదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో దుండగులకు, అత్యాచారాలకు పాల్పడే వారికి ఎలాంటి చోటు లేదని స్పష్టం చేశారు. ఇంకా పశ్చిమ బెంగాల్‌లో మిగిలి ఉన్న దుండగులు, అక్రమ ఆయుధాలు కలిగిన వారు తక్షణమే బెంగాల్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వారికి రాష్ట్రంలో ఎలాంటి స్థానం లేదని తేల్చిచెప్పారు.

పోలీసుల చర్యలపై హైకోర్టును ఆశ్రయించిన HRC

ఈ వరుస పరిణామాలపై మానవ హక్కుల కమిషన్ హైకోర్టును ఆశ్రయించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసుల కాల్పుల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని, ఘటనలపై న్యాయపరమైన పరిశీలన జరగాలని కోరుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం న్యాయస్థానం దృష్టికి చేరింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ పోలీసులు ఆత్మరక్షణ కోణాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ.. ఆ వాదనలను స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నది మానవ హక్కుల సంఘాల ప్రధాన అభ్యంతరం. పోలీసుల చర్యలు చట్టబద్ధమైనవేనా? కాల్పులు నిజంగానే అనివార్యమయ్యాయా..? ఈ ప్రశ్నలకు విచారణ ద్వారానే సమాధానాలు లభించాల్సి ఉంది.

టీఎంసీ నేతలకు కోడిగుడ్ల ట్రీట్మెంట్..

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగాయంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీఎంసీ నేతలే లక్ష్యంగా కోడిగుడ్ల దాడులు జరుగుతున్న ఘటనలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలు కేసుల్లో అరెస్టయిన టీఎంసీ నేతలను పోలీసులు కోర్టుకు తరలిస్తున్న సమయంలో కొందరు వారిపై కోడిగుడ్లతో దాడులకు దిగుతున్నారు. అంతేకాకుండా, వివిధ ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లిన టీఎంసీ నేతలపైనా దాడులు జరిగిన ఘటనలు కలకలం రేపాయి. స్వయంగా పార్టీ కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా మరో అడుగు ముందుకేసి, టీఎంసీకి అనుకూలంగా ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయంటూ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బెంగాల్‌లో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, పోలీసుల చర్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.