Giribabu Biography

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఐదు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో శకం ముగిసింది. గిరిబాబు మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గిరిబాబు(Giribabu Biography) మరణంతో తెలుగు సినిమా ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. గిరిబాబు ప్రస్థానం ఓ చరిత్ర. 600కు పైగా సినిమాలు.. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా హీరోగా, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు. రంగస్థలం నుంచి వెండితెర వరకు అద్భుత ప్రయాణం ఈయనది. మూడు తరాల అగ్రహీరోలతో నటించిన విలక్షణ నటుడు. నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవిత సాఫల్య పురస్కారం, గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి
గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతలలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. తండ్రి యర్ర నాగయ్య, తల్లి నాగరత్నమ్మ. చిన్నప్పటి నుంచే గిరిబాబుకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ఊరిలో ఏర్పాటు చేసే టూరింగ్ టాకీస్‌లకు వెళ్లి సినిమాలు చూడటం ఆయనకు అలవాటు. సినిమాలపై ఉన్న ఆసక్తితోనే భవిష్యత్తులో నటుడిగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అందుకే చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం నటించడమే కాకుండా సొంతంగా నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రంగస్థలంపై(Giribabu Biography) సంపాదించిన అనుభవం ఆయనకు సినిమాల్లో ఎంతో ఉపయోగపడింది. నటనలో తన ప్రతిభను నిరూపించుకోవాలనే పట్టుదలతో మద్రాసు వెళ్లి.. ఎన్నో ప్రయత్నాలు చేసి వెండితెరకు పరిచయం అయ్యారు.

సినీ ప్రయాణం..
గిరిబాబు1973లో ‘జగమే మాయ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సినీ ప్రయాణంలో గిరిబాబు ఫస్ట్‌ హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే ఆయనలోని విలక్షణమైన రూపం, గంభీరమైన గొంతు, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ప్రతినాయక పాత్రలకు బాగా సరిపోయాయి. దీంతో క్రమంగా విలన్ పాత్రల్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. జ్యోతి, మా దైవం, కురుక్షేత్రం, దేవతలారా దీవించండి వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో విలన్‌గా గిరిబాబు (Giribabu Biography)మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అప్పటి అగ్రహీరోల సినిమాల్లో ఆయనకు కీలకమైన ప్రతినాయక పాత్రలు లభించేవి. అలాగని విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. తన నటనలోని మరో కోణాన్ని బయటపెడుతూ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, కుటుంబ పెద్దగా, తండ్రిగా, ఊరి పెద్దగా అనేక రకాల పాత్రలు పోషించారు. పాత్ర చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.

ఎన్నో మరపురాని పాత్రలు
గిరిబాబు(Giribabu Biography) సినీ ప్రయాణంలో ఐదు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 600కు పైగా సినిమాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్, కామెడీ ఇలా ఎన్నో విభిన్న జానర్లలో నటించారు. ఆయన సినిమాల్లో గుర్తుండిపోయేవి.. భైరవద్వీపం, హలో బ్రదర్, అల్లుడా మజాకా, సిసింద్రీ, అతడు, నువ్వే కావాలి, ప్రేమలేఖలు, కితకితలు, ఎవడైతే నాకేంటి, బిందాస్, అ..ఆ, గీత గోవిందం,
శ్రీకారం, జాతిరత్నాలు, ఒకే ఒక జీవితం, అన్నీ మంచి శకునములే ఇలా అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా విలన్‌గా ఉన్నప్పుడు తెరపై చూపించిన గంభీరత, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ప్రదర్శించిన సహజ నటన ఆయన ప్రత్యేకతగా నిలిచాయి.

నిర్మాతగా, డైరెక్ట్‌గా సక్సెస్
గిరిబాబు(Giribabu Biography) ప్రతిభ నటనకే పరిమితం కాలేదు. సినిమా నిర్మాణం, దర్శకత్వం, కథా రచనపై కూడా ఆయనకు మంచి పట్టు ఉండేది. సొంతంగా సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో ‘జయభేరి ఆర్ట్ పిక్చర్స్’ బ్యానర్‌ను స్థాపించారు. 1977లో ‘దేవతలారా దీవించండి’ చిత్రంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సింహగర్జన, సంధ్యారాగం, మెరుపుదాడి, ఇంద్రజిత్, రణరంగం వంటి సినిమాల నిర్మాణంలో భాగమయ్యారు. దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. మెరుపుదాడి వంటి చిత్రాలకు కథా రచనలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.

కృష్ణతో ప్రత్యేక అనుబంధం
గిరిబాబు(Giribabu Biography) సినీ జీవితంలో సూపర్‌స్టార్ కృష్ణతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కృష్ణతో కలిసి ఆయన సుమారు 150 సినిమాల్లో నటించినట్లు గిరిబాబు తన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం, వృత్తిపరమైన అనుబంధం ఉండేదని ఆయన చెప్పారు. కృష్ణ కథానాయకుడిగా నటించిన అనేక చిత్రాల్లో గిరిబాబు కీలక పాత్రలు పోషించారు. కృష్ణ దర్శకత్వం వహించిన సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాల్లోనూ గిరిబాబు నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి, నాగార్జున వరకు పలు తరాల అగ్రహీరోలతో కలిసి తెరను పంచుకున్నారు. ఒక్కో తరంలో ఒక్కో తరహా పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగించడం ఆయన ప్రత్యేకత.

పురస్కారాలు, గౌరవాలు
గిరిబాబు నటనకు 2022లో సాక్షి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆయన సినీ జీవితంలో 50 సంవత్సరాల ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించింది. 2012లో అమెరికాకు చెందిన AIM Westbrook University ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సినీ రంగానికి, సామాజిక సేవకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. 2014లో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా గిరిబాబును(Giribabu Biography) ఘనంగా సత్కరించారు. ఐదు దశాబ్దాలకు పైగా ఆయన చేసిన సినీ ప్రయాణానికి ఈ గౌరవం మరో గుర్తింపుగా నిలిచింది.

సొంతూరుపై మమకారం
గిరిబాబుకు(Giribabu Biography) తన స్వగ్రామమైన రావినూతలతో ప్రత్యేక అనుబంధం ఉండేది. సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నా తన ఊరిని, అక్కడి ప్రజలను మర్చిపోలేదు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తన గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మాణం కోసం 1.25 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2008లో గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణానికి కూడా సహకరించారు. తనకు పేరు, గుర్తింపు తెచ్చిన సినీ రంగంతో పాటు సొంత ఊరికి కూడా ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉండేది.

కుటుంబం నేపథ్యం..
గిరిబాబు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఆయన భార్య శ్రీదేవి 2016 మే 12న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణం గిరిబాబు కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రఘుబాబు టాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. పలు సినిమాలకు డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు పొందారు. రెండో కుమారుడు బోసుబాబు కూడా నటుడిగా కొన్ని సినిమాల్లో పనిచేశారు. కుమార్తె మాధవి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇలా గిరిబాబు(Giribabu Biography) కుటుంబానికి తెలుగు సినిమా రంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

చివరి సినిమా
వయసు పెరుగుతున్నప్పటికీ గిరిబాబు(Giribabu Biography) నటనకు పూర్తిగా దూరం కాలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను పలకరించేవారు. గీత గోవిందం, శ్రీనివాస కల్యాణం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, జాతిరత్నాలు, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో న్యాయమూర్తి పాత్రలో కనిపించారు. అదే ఆయన చివరి చిత్రంగా నిలిచింది. గిరిబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన నటించిన వందలాది సినిమాలు, మరపురాని పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓం శాంతి!