ఏపీలోనే అత్యంత పెద్ద కార్పొరేషన్ గా అవతరించిన విశాఖ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయించే యోచనలో కూట‌మి నాయ‌క‌త్వం ఉంది. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన నగరాల్లో తిరుపతి మేయర్ ప‌ద‌వి టీడీపీకి ద‌క్క‌గా.. జనసేన డిప్యూటీ మేయర్ ప‌ద‌వి కోరుకుంటోంది. విజయవాడ మేయర్‌గా జనసేన అభ్యర్ధి ఎన్నిక‌వ్వ‌టంతో, అక్కడ డిప్యూటీ మేయర్ ప‌ద‌విని టీడీపీ అడుగుతోంది. ఇక మిగిలిన మూడో అతి పెద్ద నగరం విశాఖ కార్పోరేషన్ మేయర్‌గా టీడీపీ అభ్య‌ర్థి ముక్కా శ్రావణి భారీ మెజారిటీతో గెలిచారు. విశాఖ కార్పొరేష‌న్ వార్షిక బ‌డ్జెట్ రూ.4,500 కోట్లు ఉంటుంది. ఇంత పెద్ద కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది.

విశాఖ డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని బీజేపీకి కేటాయిస్తే మరింత అభివృద్ది చెందుతుంద‌ని కేంద్రం నుంచి మరింత సహాయ సహకారాలు అందే అవకాశం ఉందని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం వంటి వాటిద్వారా మరింత ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు.విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూట‌మి పొత్తుల్లో భాగంగా బీజేపీకి 11సీట్లు కేటాయిస్తే 8స్థానాల్లో విజయం సాధించారు. విశాఖ న‌గ‌రంలో రెండు లక్షల‌మందికి పైనే ఉత్త‌రాది ఓటర్లున్నారు. దీంతో స‌హ‌జంగానే బీజేపీకి సాగ‌ర న‌గ‌రిలో కొంత ప‌ట్టుంది. గ‌తంలో ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి బీజేపీ నుంచి విశాఖ మేయర్ గా పని చేశారు.. కంభంపాటి హరిబాబు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్య‌త‌ల్లో ఉన్న పీవీఎన్ మాధవ్ కూడా విశాఖ వాసి.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో స్టీల్ ప్లాంట్, పోర్ట్ , షిప్‌యార్డ్, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, డాక్ యార్డ్, నేవీ, రైల్వే జోన్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.. ఉమ్మడి విశాఖ జిల్లా లో అర్సెల్లార్ మిట్టల్, గూగుల్ డేటా సెంటర్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే వచ్చాయి. స్థానిక సంస్థ‌ల్లో బీజేపీ కి ప్రాధాన్యమిస్తే మరిన్ని పెద్ద సంస్థలు విశాఖకి రావడానికి అనుకూల ప‌రిస్థితులు ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. డిప్యూటీ మేయర్ రేసులో ప్రధానంగా విశాఖపట్నం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరుశరామరాజు పేరు వినిపిస్తోంది. ఒకవేళ జనసేన పార్టీకి కనుక పదవి ఇస్తే.. సౌత్ సెగ్మెంట్ పరిధిలోని 40 డివిజన్ నుంచి గెలిచిన భీశెట్టి వసంత లక్ష్మికి అవకాశం ఉందంటున్నారు.