సజ్జనార్ స్థానచలనం వెనుక అసలు కథ!

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అధికారయంత్రాంగంలో సంచలనం సృష్టిస్తోంది. 14 నెలలకే ఆయనకు స్థానచలనం ఎందుకు జరిగిందని పోలీసు శాఖలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. 2025 సెప్టెంబర్‌లో నగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్‌కు కేవలం 14 నెలల్లోనే ప్రభుత్వం బదిలీ చేసింది. నగర పోలీస్ కమిషనర్‌ని కనీసం రెండేళ్లపాటు ఆ పదవి నుంచి ప్రభుత్వం కదిలించదు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల భద్రత వంటి అనేక బాధ్యతలు సీపీ పోస్టుతో ముడిపడి ఉంటాయి. అలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిని ఇంత తక్కువ వ్యవధిలో మార్చడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. ఆయనను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డీజీగా నియమించడంతోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బాధ్యతలు కూడా అప్పగించారు.
సజ్జనార్ బదిలీ ప్రభుత్వ వ్యూహమా? పోలీస్ శాఖలో ప్రక్షాళనలో భాగమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆయనతో పాటు ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో పాలనా వ్యవహారాల్లో భాగంగానే సీపీ సజ్జనార్‌ని ఆ బాధ్యతలనుంచి తప్పించారా లేదంటే బలమైన కారణాలున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. పోలీస్ వ్యవస్థలో సమన్వయం, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసిందన్న ప్రచారం కూడా ఉంది. అయితే సంచలన నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన సజ్జనార్‌ని పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ నల్లగొండ, కడప, గుంటూరు, వరంగల్, మెదక్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019లో దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కొత్త బస్సులు, కార్గో సేవలు, ప్రయాణికుల సౌకర్యాలను కల్పించి సంస్థను గాడిన పెట్టారు.
సజ్జనార్ స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. రాజధానిలో పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, భూకబ్జాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కొత్త కొత్వాల్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కూడా పగడ్బందీగా నిర్వహించవలసిన బాధ్యత కొత్త సీపీపై ఉంది. మరోవైపు సజ్జనార్ కొత్త బాధ్యతలు చూడాల్సి ఉంది. అగ్నిప్రమాదాల నివారణ, విపత్తుల సమయంలో తక్షణ స్పందన, అత్యవసర సేవల నిర్వహణ, పౌర రక్షణ వంటి కీలక అంశాలు ఇప్పుడు ఆయన పరిధిలోకొచ్చాయ. ఒకవైపు 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు.. మరోవైపు కీలక విభాగాల్లో కొత్త నియామకాలు.. ఈ మార్పులన్నీ తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త కార్యాచరణకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసింగ్‌లో కొత్త కమిషనర్ ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? సజ్జనార్‌కు తనకు అప్పగించిన కొత్త బాధ్యతల్లో ఎలాంటి ఫలితాలు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



