డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు
Congress Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు. చెన్నైకి రెండు విమానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు. ముంబయిలో ఎన్సీపీ ఎస్పీ నేతలతో వరుస సమావేశాలు..

Congress Delimitation Bill: డీలిమిటేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రాంతీయ పార్టీల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు స్టాలిన్‌తో భేటీ
ఈ వ్యూహంలో భాగంగా ఖర్గే మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని స్టాలిన్‌ను ఖర్గే కోరనున్నట్లు తెలుస్తోంది. బిల్లును వ్యతిరేకించాలని, పార్లమెంటులో దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు, ప్రాతినిధ్యంపై ఈ బిల్లు చూపే ప్రభావాన్ని వివరించి డీఎంకే మద్దతు పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నించనుంది.ఇప్పటికే జరిగిన ఇండియా కూటమి సమావేశానికి స్టాలిన్ గైర్హాజరవడంతో పాటు.. తాము డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో స్టాలిన్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు మొత్తం చెన్నైకి క్యూ కట్టారు. అయితే కాంగ్రెస్ నేతలు చెన్నైకి వస్తున్నట్లు తమకు సమాచారం లేదని డీఎంకే నేతలు చెబుతున్నారు.
రాత్రి 8 గంటలకు శరద్ పవార్‌తో సమావేశం
అనంతరం రాత్రి 8 గంటలకు ముంబయిలో ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్‌తో ఖర్గే భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనూ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించేలా పవార్ మద్దతు కోరనున్నారు. ఈ రెండు కీలక సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. అయితే బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని శరద్ పవార్ తెలిపారు. అంతేకాకుండా శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కేంద్రమంత్రి పదవి ఖాయమంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేతలతో చర్చించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్ నేతల ప్రయాణం
ఈ కీలక రాజకీయ చర్చల కోసం ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రెండు ప్రత్యేక విమానాల్లో చెన్నై, ముంబయికి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించడం, పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వ్యూహాన్ని రూపొందించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా ఖర్గే చేపట్టిన ఈ చర్చలు డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంటులో రాజకీయ సమీకరణాలను మార్చనున్నాయా అన్నది ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని డీఎంకే, ఎన్సీపీ-ఎస్పీ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ భేటీలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా పార్టీల వైఖరిలో మార్పు తీసుకురావడం ద్వారా పార్లమెంటులో బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎంపీలకు సమాజ్‌వాదీ పార్టీ విప్
మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అప్రమత్తమైంది. సమావేశాలకు ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ మూడు లైన్ల విప్ జారీ చేసింది.



