బిస్లరీపై కార్పొరేట్ గురి..? పది రోజుల్లో రెండు రాష్ట్రాల్లో తనిఖీలు..!
Bisleri Under Corporate Pressure: ముందు గోవాలో తనిఖీలు.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనూ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ.. బిస్లరీపై FSSAI వరుస చర్యలతో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లో సంచలనం. నిజంగానే నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన జరిగిందా..? లేక కంపెనీని లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్ రాజకీయాలకు తెరలేపారా..?

Bisleri Under Corporate Pressure: రాజకీయాల్లో అధికారం కోసం ఎత్తుకు పైఎత్తులు వేయడం సహజం. ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు, వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల బరిలో ఆధిపత్యం సాధించేందుకు నాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ కార్పొరేట్ ప్రపంచంలో రాజకీయాలు మరో రూపంలో ఉంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. మార్కెట్లో బలమైన స్థానంలో ఉన్న సంస్థను దెబ్బతీయాలంటే.. ముందుగా దాని ప్రతిష్ఠను ప్రశ్నార్థకం చేయడం, నియంత్రణ సంస్థల తనిఖీలు, నాణ్యతపై వివాదాలు వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ విషయంలోనూ ఇలాంటి చర్చ మొదలైంది.
గోవాతో మొదలైన కలకలం.. బెంగాల్‌కు విస్తరణ
బిస్లరీకి ఇటీవల గోవాలో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ప్లాంట్ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు నాణ్యతా పరీక్షల్లో విఫలైమనట్లు FSSAI ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనకు సంబంధించి సంస్థపై చర్యలు తీసుకునేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామం మరువకముందే పశ్చిమ బెంగాల్లోనూ బిస్లరీకి సంబంధించిన మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా టెలిపారా గ్రామంలోని బిస్లరీ ప్లాంట్ నుంచి అధికారులు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలను సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపించి పరీక్షించగా కొలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. అనంతరం ఆ నమూనాలను రెఫరల్ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా బ్యాక్టీరియా ఉనికి నిర్ధారణ అయినట్లు FSSAI అధికారులు చెబుతున్నారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతిచ్చారు.
రెండు రాష్ట్రాలు.. పది రోజుల గ్యాప్.. బిగ్ పొలిటికల్ గేమ్..?
ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ఒకే కంపెనీకి చెందిన ప్లాంట్లపై తక్కువ వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో తనిఖీలు జరగడం, రెండు చోట్లా నాణ్యతకు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. బిస్లరీ వంటి దేశవ్యాప్త బ్రాండ్‌పై వరుసగా ప్రతికూల వార్తలు రావడం మార్కెట్లో సంస్థ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామాల వెనుక ఏదైనా కార్పొరేట్ కుట్ర ఉందా..? మార్కెట్లో బిస్లరీ స్థానాన్ని దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నారా..? కంపెనీని హస్తగతం చేసుకోవాలనే వ్యాపార ప్రయోజనాల కోసం ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారా..? అనే ప్రశ్నలు కొందరి నుంచి వినిపిస్తున్నాయి. దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌కు భారీ వ్యాపార విలువ ఉంది. కోట్లాది మంది వినియోగదారులు నమ్మకంతో కొనుగోలు చేసే ఈ రంగంలో బ్రాండ్ ఇమేజ్ అత్యంత కీలకం. ఒకసారి నాణ్యతపై అనుమానాలు మొదలైతే వినియోగదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రత్యర్థి సంస్థలకు మార్కెట్ వాటాను పెంచుకునే అవకాశం కూడా లభిస్తుంది.
బిస్లరీ వాదన ఏంటి..?
మరోవైపు తమ సంస్థ తయారు చేస్తున్న నీరు సురక్షితమైనదేనని బిస్లరీ చెబుతోంది. నియంత్రణ సంస్థల పరీక్షల్లో వచ్చిన ఫలితాలు, సంస్థ వివరణ, తదుపరి విచారణలో వెలువడే వాస్తవాలు ఈ వివాదంలో కీలకం కానున్నాయి. గోవాలో మొదలై బెంగాల్‌కు చేరిన బిస్లరీ వివాదం ఇప్పుడు దేశ కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నిజంగా నాణ్యతా లోపాలుంటే చర్యలు తప్పనిసరి. కానీ వాటి వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలుంటే వాటికీ ఆధారాలతోనే సమాధానం రావాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక కంపెనీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. కోట్లాది మంది వినియోగదారుల ఆరోగ్యం, నమ్మకంతో పాటు దేశ కార్పొరేట్ రంగంలో పారదర్శకతకు సంబంధించిన అంశం నిపుణులు చెబుతున్నారు.



