Jaipur Noodles Incident: మీరు నూడుల్స్ తింటున్నారా..? మీ పిల్లలకు కూడా ఇష్టమైన ఆహారమేనా..? అయితే ఈ ఘటన గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సరదాగా ఇంట్లో తయారుచేసుకుని తిన్న నూడుల్స్ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. నూడుల్స్ తిన్న కొద్దిసేపటికే ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. అసలు ఆ నూడుల్స్‌లో ఏముంది..? తిన్న వెంటనే చిన్నారుల ఆరోగ్యం ఎందుకు క్షీణించింది..? జైపూర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

నూడుల్స్ తిని నిద్రపోయిన సిస్టర్స్.. ఆ తర్వాత…!

ఆహారం అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా నూడుల్స్ వంటి వంటకాలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇంట్లోనే తయారుచేసుకుని తినడం కూడా చాలామంది కుటుంబాల్లో సాధారణమే. అయితే రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ఇలాంటి ఆహార పదార్థాల విషయంలో ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్‌లోని జైపుర్ మంగళం సిటీ ప్రాంతంలో ఓ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తయారుచేసిన నూడుల్స్‌ను ఇద్దరు అక్కాచెల్లెళ్లు తిన్నారు. ఆ తర్వాత నిద్రపోవడానికి వెళ్లారు. అయితే ఆ ఆహారం తిన్న కొన్ని గంటల్లోనే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. చివరకు ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరి కూడా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది.

నూడుల్స్ తిని జైపూర్‌లో చిన్నారి మృతి

చిన్నారుల తల్లిదండ్రులు దినేశ్ కుమావత్, మీనా తమ కుమార్తెలను ఇంట్లోనే ఉంచి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసుకోవడానికి వారు ఆసుపత్రికి వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే ఉన్నారు. అంతకుముందు ఇద్దరూ ఇంట్లో తయారుచేసిన నూడుల్స్ తిన్నారు. అనంతరం నిద్రపోయారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. కుమార్తెలను నిద్రలేపేందుకు ప్రయత్నించింది. అయితే పెద్ద కుమార్తె నిద్ర నుంచి లేచింది. ఏడేళ్ల చిన్నారి మాత్రం ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద కుమార్తె ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఏడేళ్ల చిన్నారి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మరో చిన్నారికి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

చిన్నారి మరణానికి నూడుల్స్‌ కారణమా..?

ఈ ఘటనలో ప్రధానంగా నూడుల్స్‌పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు చిన్నారులు ఒకే ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురికావడం, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కన్వాటియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు చిన్నారులు తిన్న నూడుల్స్ నమూనాలను ఇంటి నుంచి సేకరించి ప్రయోగశాలకు పంపించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఆహార నమూనాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడనుంది.

బిర్యానీ, పుచ్చకాయ ఘటన కూడా మరువకముందే..

ఇటీవల ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలు బిర్యానీ, పుచ్చకాయ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారు తిన్న ఆహారమే మరణాలకు కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

నూడుల్స్ తినేవారు ఒక్కసారి ఆలోచించండి

ఈ ఘటనలన్నీ ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా చిన్నారులకు ఆహారం తయారుచేసి ఇచ్చే సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. వంటకు ఉపయోగించే పదార్థాలు తాజాగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఆహారం తయారుచేసే ప్రదేశం, వంట పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటూ ఇలా జైపూర్ చిన్నారిలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.