నా ఇంట్లోకి షర్మిలను అడుగు పెట్టనివ్వొద్దు: జగన్
YS Jagan vs YS Sharmila: వైఎస్ కుటుంబంలో యలహంక ప్యాలెస్ వివాదం.. జగన్ సంచలన నిర్ణయం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో పిటిషన్..కుటుంబంలో మరోసారి ముదిరిన విభేదాలు

YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత, మాజీర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య యలహంక ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కుమార్తె వివాహ వేదిక విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు బయటపడగా.. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. యలహంక నివాసంలోకి షర్మిల ప్రవేశించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.
కుమార్తె పెళ్లి వేదికగా యలహంక ప్యాలెస్
బెంగళూరులోని యలహంక ప్రాంతంలో ఉన్న నివాసంలో తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకలను నిర్వహించాలని షర్మిల తొలుత నిర్ణయించుకున్నారు. నవంబర్ 25న పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే బంధువులు, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందించారు. అయితే యలహంక నివాసంలో వివాహ వేడుకలు నిర్వహించడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ వివాహ వేదికను మార్చుకోవాలని షర్మిలకు లేఖ రాశారు. దీంతో షర్మిల తన కుమార్తె వివాహ వేదికను మరో ప్రాంతానికి మార్చుకున్నట్లు సమాచారం. అయితే యలహంక నివాసంతో తనకు కుటుంబపరమైన అనుబంధం ఉండటంతో అక్కడికి వెళ్లాలనే ఆలోచనను మాత్రం విరమించుకోలేదని తెలుస్తోంది.
షర్మిల రాకతో అప్రమత్తమైన జగన్..?
కుమార్తె వివాహ ఏర్పాట్లలో భాగంగా షర్మిల ఆదివారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా యలహంక నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆమె భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తన సోదరుడు జగన్‌ను కలిసి కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే షర్మిల యలహంక నివాసానికి రానున్నారనే విషయం తెలియడంతో జగన్ అప్రమత్తమైనట్లు సమాచారం. ఆమె అక్కడికి రాకుండా ముందస్తు చర్యలకు దిగినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది.
దేవనహళ్లి కోర్టులో పిటిషన్.. సిలికాన్ బిల్డర్స్ పేరుతో దాఖలు
యలహంక నివాసంలోకి షర్మిల ప్రవేశించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేవనహళ్లి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సిలికాన్ బిల్డర్స్ పేరుతో భీమిశెట్టి రమేశ్‌బాబు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. షర్మిలకు యలహంక నివాసంపై ఎలాంటి హక్కులు లేవని, ఆమె అక్కడికి ప్రవేశించకుండా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివాసం తన సతీమణి తల్లి సుగుణమ్మకు చెందినదని జగన్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటిపై షర్మిలకు ఎలాంటి హక్కులు లేవనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.
పెళ్లి ఆహ్వానాల మధ్య కొత్త వివాదం
మరోవైపు షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలను ఇప్పటికే పలువురు ప్రముఖులకు అందిస్తున్నారు. రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను స్వయంగా కలిసి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌కు కూడా ఆహ్వాన పత్రిక అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యలహంక నివాసం విషయంలో జగన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడంపై కూడా గతంలో రాజకీయంగా చర్చ జరిగింది. ఈ అంశంపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. తన కుమార్తె వివాహానికి రాజకీయ రంగు పులమడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా యలహంక ప్యాలెస్ వ్యవహారం తెరపైకి రావడంతో వైఎస్ కుటుంబంలోని విభేదాలు మరోసారి వార్తల్లో నిలిచాయి.
కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
కుమార్తె వివాహం సందర్భంగా మొదలైన యలహంక ప్యాలెస్ వివాదం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాహ వేదికను మార్చుకున్న షర్మిల.. ఇప్పుడు యలహంక నివాసానికి వెళ్లే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జగన్ దాఖలు చేసినట్లు చెబుతున్న పిటిషన్‌పై దేవనహళ్లి కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది.. షర్మిల తన అన్నకు పెళ్లి ఆహ్వానం అందించగలుగుతారా.. యలహంక నివాసం విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది.. అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



