పెళ్లి పిలుపులోనూ రాజకీయ కుట్రలా..? సాక్షిపై షర్మిల ఫైర్
YS Sharmila Slams Sakshi Newspaper: ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందించడంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. సాక్షి దినపత్రిలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ మండిపడుతూ ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.

YS Sharmila Slams Sakshi Newspaper: తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై సాక్షి దినపత్రిక ప్రచురించిన కథనంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక సాధారణ పెళ్లి ఆహ్వానంలో కూడా రాజకీయ కోణాలు వెతుకుతూ, తనకు తప్పుడు సంబంధాలు అంటగట్టేలా కథనాలు రాయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనం తన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా, తన కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీసేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.
పెళ్లి ఆహ్వానంలోనూ వక్రభాష్యాలా: షర్మిల
తన కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంలో తప్పేముందని షర్మిల ప్రశ్నించారు. తండ్రి వయసున్న వ్యక్తికి పెళ్లి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాలంటూ వ్యాఖ్యానిస్తారా..? ఆత్మీయ సంబంధాలకు తప్పుడు అర్థాలు ఆపాదిస్తారా..? అంటూ సాక్షి కథనంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మనిషై పుట్టినవారు ఒక ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేయడం సమంజసమేనా..? సమాజం పట్ల విలువలు, మానవ సంబంధాల పట్ల కనీస గౌరవం ఉన్నవారు ఇలాంటి రాతలు రాస్తారా అని నిలదీశారు. పెళ్లి పిలుపులో కూడా రాజకీయ ప్రయోజనాలు వెతకడం సాక్షి పత్రిక దిగజారుడు ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే… సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
— YS Sharmila (@realyssharmila) November 17, 2026
జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు
మహిళల పట్ల అమితమైన గౌరవం ఉందని చెప్పుకునే జగన్‌మోహన్‌రెడ్డి, తన సొంత పత్రికలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని షర్మిల ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మలపై ప్రేమ ఉందని చెప్పే మీరు.. మీ పత్రికలో ఇలాంటి కథనాలకు ఎలా అనుమతిస్తున్నారు? ఒక మహిళపై నీలాపనిందలు వేయడమే మీ పత్రిక విధానమా..? తల్లి, చెల్లి అనే తేడా లేకుండా బురదజల్లే రాతలు రాయించడమే మీ రాజకీయ ఎజెండానా? అంటూ నిలదీశారు. తనపై, తన కుటుంబంపై వ్యక్తిత్వ హననం చేసేలా కథనం ప్రచురించినందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కథనంపై జగన్ స్వయంగా వివరణ ఇస్తారా..? లేక సాక్షి పత్రికతోనే సంజాయిషీ ఇప్పిస్తారా..? అని ప్రశ్నించారు.
“గతంలో వైఎస్‌ఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానించలేదా”
తన వాదనకు మద్దతుగా షర్మిల గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన పిల్లల వివాహ వేడుకలకు అప్పటి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడిని కూడా ఆహ్వానించారని గుర్తుచేశారు. అప్పుడు వైఎస్‌ఆర్ చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లా..? చంద్రబాబు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదిస్తే ఇద్దరి మధ్య రాజకీయాలకు అతీతమైన సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అర్థమా.. అని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలు వేరు.. వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు వేరని, వివాహాలు వంటి శుభకార్యాలకు రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించడం సాధారణ సంప్రదాయమన్నారు.
యలహంక ప్యాలెస్ వివాదం.. ఇప్పుడు సాక్షి కథనంతో మరింత వేడి!
ఇదిలా ఉండగా, షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహ వేడుకల నేపథ్యంలో యలహంక ప్యాలెస్ వ్యవహారం కూడా గతంలో రాజకీయ చర్చకు దారితీసింది. వివాహ వేడుక కోసం ప్యాలెస్ ఇవ్వలేదన్న అంశంపై షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఇవ్వలేనంటూ వచ్చిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడంపై సాక్షి ప్రచురించిన కథనం మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ కథనాన్ని షర్మిల తన వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
సాక్షి సంజాయిషీ ఇవ్వాల్సిందే: షర్మిల
తనపై తప్పుడు అర్థాలు వచ్చేలా కథనాలు ప్రచురించడం వెనుక ఉద్దేశం ఏమిటని షర్మిల ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేయడానికి అనేక అంశాలున్నాయని, వాటిని వదిలేసి ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై బురదజల్లడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సాక్షి పత్రిక ప్రచురించిన కథనంపై జగన్ స్పందించాలని, జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, కుటుంబ విలువలు, మానవ సంబంధాల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు తమ మీడియా సంస్థల్లో వచ్చే కథనాల విషయంలోనూ అదే విలువలను పాటించాలని షర్మిల స్పష్టం చేశారు. మొత్తంగా కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో వివాదానికి తెరలేపింది. ఒకవైపు సాక్షి కథనంపై షర్మిల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జగన్ నుంచి, సాక్షి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.



