Delimitation Bill BJP Strategy: మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపుతోంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో అనుసంధానిస్తూ కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పార్లమెంటు ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరిచే యోచనలో ఉంది. అయితే గతంలో ఇదే అంశంపై బిల్లు ప్రవేశపెట్టి, అవసరమైన మద్దతు సాధించలేక భంగపడిన ఎన్డీయే ప్రభుత్వం.. ఈసారి మాత్రం విజయం సాధిస్తుందా..? రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని కూడగట్టగలదా..? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం సిద్ధం

మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌ ప్రక్రియతో కలపకుండా విడిగా ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళా బిల్లుకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే కేంద్రం మాత్రం మహిళా రిజర్వేషన్ల అమలుకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే వైఖరితో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో శీతాకాల సమావేశాలకు ముందుగానే పార్లమెంటు ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. రెండురోజుల నోటీసుతోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఇంకా ప్రొరోగ్ చేయకుండా ఉంచినట్లు తెలుస్తోంది. బిల్లును సభలో ప్రవేశపెట్టడమే కాకుండా, ఆమోదం పొందేందుకు అవసరమైన రాజకీయ మద్దతును కూడగట్టడంపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది.

లోక్‌సభలో 361 మంది మద్దతు తప్పనిసరి

డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో సభ్యుల సంఖ్య 540గా ఉంది. ఈ సంఖ్య ఆధారంగా బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 361 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే సాధారణ మెజారిటీతో ఈ బిల్లును గట్టెక్కించడం సాధ్యం కాదు. ప్రభుత్వ వర్గాలు మాత్రం అవసరమైన సంఖ్యాబలానికి మించి మరో 15 నుంచి 18 మంది సభ్యుల మద్దతు కూడగట్టగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందుకోసం డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలతో పాటు స్వతంత్ర సభ్యుల మద్దతును పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు..?

దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచి, ఆ తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అందుకే జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచాలనే ప్రతిపాదనకు కొన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

మద్దతు కూడగట్టేందుకు ఎన్డీయే ప్రయత్నాలు

గతంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఏప్రిల్ 17న ఆమోదం పొందలేదు. దీంతో ఈసారి మరిన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. బిల్లులో రాష్ట్రాల వారీగా 50 శాతం సీట్ల పెంపు అంశాన్ని స్పష్టంగా చేరిస్తే మద్దతు ఇచ్చేందుకు కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం రాజకీయంగా అందరినీ ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌-డీఎంకే కూటమిలో వచ్చిన విభేదాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డీఎంకే మద్దతు పొందేందుకు కేంద్రం ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మంత్రులతో మోదీ చింతన్ శిబిర్

ఇదిలా ఉంటే ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం కేంద్ర మంత్రిమండలితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చింతన్ శిబిర్ పేరుతో జరగనున్న ఈ భేటీలో పాలనాపరమైన అంశాలు, సంస్కరణలు, మహిళలు-యువతకు సంబంధించిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణతో పాటు కీలక విధాన నిర్ణయాలపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది.

రాజ్యసభలోనూ ఎన్డీయేకు సవాలే!

లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన ప్రక్రియ పూర్తయినట్లు కాదు. రాజ్యసభలోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో 244 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులందరూ సభకు హాజరైతే కనీసం 163 మంది మద్దతు అవసరం. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందితేనే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేకు ఉభయ సభల్లోనూ అవసరమైన సంఖ్యాబలం లేదు. లోక్‌సభలో ఎన్డీయేకు 319 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో టీఎంసీకి చెందిన 20 మంది, శివసేనకు చెందిన ఆరుగురు సభ్యుల మద్దతును కూడా కలిపినట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ బిల్లుకు అవసరమైన 361 మంది మద్దతును సాధించాలంటే మరిన్ని పార్టీల సహకారం తప్పనిసరి. రాజ్యసభలోనూ ఎన్డీయేకు ప్రస్తుతం 151 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అక్కడ అవసరమైన సంఖ్య 163 కావడంతో మరో 12 మంది సభ్యుల మద్దతును సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డీఎంకే వంటి పార్టీల వైఖరి బిల్లు భవితవ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

50 శాతం సీట్లు పెంచితే మద్దతిస్తాం: సుప్రియా సూలే

డీలిమిటేషన్ విషయంలో ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచాలన్న ప్రతిపాదనకు తాను సానుకూలంగా ఉన్నట్లు ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా సీట్ల పెంపు చేపడితే తనకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే ఈ విషయంలో తమ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన అందలేదని స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం ఈ అంశంపై అనధికారికంగా చర్చలు జరిగిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు. శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావంత్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు తనను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని వెల్లడించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం చొప్పున లోక్‌సభ స్థానాలు పెంచే ప్రతిపాదనపై అప్పట్లో చర్చ జరిగినట్లు తెలిపారు. మరి కేంద్రం తన వ్యూహంతో అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగడుతుందా..? మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేస్తుందా..? లేక మరోసారి రాజకీయ ప్రతిష్టంభన తప్పదా..? అన్నది త్వరలో తేలనుంది.