TDP and JanaSena candidates: మున్సిపల్ ఎన్నికలు.. జాబితా విడుదల చేసిన జనసేన- టీడీపీఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తికాగా.. మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం బీజేపీలో అసంతృప్తికి దారితీసింది. బాపట్లలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

మంగళగిరి- తాడేపల్లి మేయర్ అభ్యర్థిగా పేరం ఏడుకొండలు

టీడీపీ ప్రకటించిన జాబితాలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పేరం ఏడుకొండలును ఖరారు చేసింది. అలాగే ఆముదాలవలస మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా కూన ప్రమీల, తణుకుకు బసవ వి.వి. రామకృష్ణ, పాలకొల్లుకు ఆబోతుల ఉషారాణి, వైఎస్సార్ తాడిగడపకు పీతా గోపీచంద్, గుడివాడకు మారీదు కరుణ పేర్లను ప్రకటించింది. అదేవిధంగా నరసరావుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నాగసరపు రూపేష్ గుప్తా, పొన్నూరుకు కండ్రు విజయలక్ష్మి, కందుకూరుకు పిడికిటి వెంకటేశ్వర్లు, గూడూరుకు చౌటూరి శిరీష, శ్రీకాళహస్తికి పేట బాలాజీని ఎంపిక చేసింది. నగర పంచాయతీల్లోనూ టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. చింతలపూడి నుంచి ఖంబం ఎస్తేరు రాణి, పొదిలి నుంచి వరికుంట్ల అనిల్ కుమార్, అల్లూరు నుంచి తోటకూర సునీల్ కుమార్, బి.కొత్తకోట నుంచి కుడుము శ్రీనివాసులును ఛైర్‌పర్సన్ అభ్యర్థులుగా ప్రకటించింది.

రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థుల ఖరారు

మరోవైపు రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డా. దానేటి రాధా రాణి, కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవానిని ఖరారు చేశారు. అలాగే రాజాం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత, భీమవరం ఛైర్మన్ అభ్యర్థిగా డా. చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెం ఛైర్మన్ అభ్యర్థిగా పాలూరు వెంకటేశ్వర రావును ఎంపిక చేశారు. ఇప్పటికే బీజేపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించగా.. తాజాగా టీడీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంతో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు: మాధవ్

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు వెళ్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన ఆయన.. గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

బాపట్ల బీజేపీలో మున్సిపల్ ఎన్నికల చిచ్చు.. అన్నం సతీష్ రాజీనామా

మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాపట్ల బీజేపీలో అసంతృప్తికి దారితీసింది. బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో మనస్తాపానికి గురైన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బీజేపీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా బాపట్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించారు. అన్నం సతీష్ రాజీనామాతో బాపట్లలో కూటమి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు అభ్యర్థుల ప్రకటనలతో టీడీపీ, జనసేన ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీజేపీలో నెలకొన్న అసంతృప్తి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.