Telangana MLC Elections: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల హడావుడి పెరిగింది. ఎవరికి అవకాశం దక్కుతుంది.. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారా.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇస్తారా.. లేక రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రముఖులకు అవకాశం కల్పిస్తారా.. అనే చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. దీంతో ఈ మూడు స్థానాల భర్తీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి.. ఖాళీ అయిన స్థానాలు

తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా కింద నామినేట్ అయిన ముగ్గురు ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగిసింది. దీంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఈ స్థానాలను భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాల్సి ఉంది.

డిసెంబర్‌లో అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్..?

మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే వెంటనే అభ్యర్థులను ప్రకటించకుండా ముందుగా కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీని పూర్తి చేయాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. అందులో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు తమకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నారు.

పద్మశాలీలకు ఒకటి.. మిగిలిన రెండు స్థానాలపై చర్చ

ఈ మూడు స్థానాల భర్తీలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. సిరిసిల్ల సభలో పద్మశాలీ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించడంతో ఆ వర్గంలో ఆశలు పెరిగాయి. దీంతో ఒక స్థానం పద్మశాలీలకు కేటాయించడం దాదాపు ఖాయమనే చర్చ సాగుతోంది. మిగిలిన రెండు స్థానాల విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజికవర్గాలతో పాటు బ్రాహ్మణ, ఎస్సీ మాదిగ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన నామినేటెడ్ స్థానాల్లో సామాజిక సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో గవర్నర్ అభ్యంతరాలు.. ఇప్పుడు మళ్లీ అదే ఉత్కంఠ..?

ఈసారి ఎమ్మెల్సీ నియామకాల్లో మరో ఆసక్తికరమైన అంశం గతంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. రాజకీయ అనుబంధం ఉన్న వ్యక్తులను కాకుండా సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన ప్రముఖులను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కొత్త పేర్లను ప్రతిపాదించనున్న నేపథ్యంలో గతంలో గవర్నర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వేచి చూస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

మొత్తానికి మూడు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త రాజకీయ సందడికి తెరలేపాయి. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు పార్టీ విధేయతలు, ఇంకోవైపు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వివిధ రంగాల్లో నిష్ణాతులకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అంశం.. ఇలా అనేక కోణాల్లో ఈ నియామకాలు ఆసక్తికరంగా మారాయి. డిసెంబర్‌లో జరగనున్న కసరత్తులో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, గవర్నర్ కోటాలో రాజకీయేతర ప్రముఖులకు ఈసారి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన ఈ ఎమ్మెల్సీ పండుగ చివరకు ఎవరికి పదవులు తెచ్చిపెడుతుందో వేచి చూడాల్సిందే..