El Nino effect on rice prices: ఆకలి తీర్చాల్సిన బియ్యమే సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. పొయ్యి మీద గిన్నె పెట్టాలంటేనే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం పేరుతో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటలు పండుతున్నాయి.. గోదాములు నిండుతున్నాయి.. ఏడాదిన్నరకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయినా మార్కెట్‌లో బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. ఎల్‌నినో దెబ్బకు తినే బియ్యం పట్టుకుంటేనే సామాన్యుడు హడలిపోతున్నాడు.

నిల్వలున్నా.. ధరల మంట!

నిత్యం ప్రతి ఇంట్లో వినియోగించే బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. మిల్లుల్లో, గోదాముల్లో పుష్కలంగా నిల్వలున్నా మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌నినో సాకుతో మిల్లర్లు నిల్వలను బయటకు విడుదల చేయకుండా ధరల ఆట ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుగానే పంటను కొంటున్న మిల్లర్లు..?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పంట చేతికొస్తుండటంతో రైతుల నుంచి సన్నరకం ధాన్యాన్ని మిల్లర్లు క్వింటాలుకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఏడాదిన్నర వరకు బియ్యం కొరత వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయినప్పటికీ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. 25 కేజీల బియ్యం బస్తా.. రూ.3 వేలు అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఒకప్పుడు ఇంట్లో బియ్యం బస్తా ఉంటే చాలు.. రెండు నెలలు గడిచిపోతుందని అభిప్రాయం ఉండేది. కానీ పరిస్థితి మారిపోవడంతో.. ధరలు సామాన్యులను హడలెత్తిస్తున్నాయి.

తనిఖీలు ఏవీ.. నియంత్రణ చర్యలేవీ..?

బియ్యం ధరలు పెరుగుతున్నా ధరల నియంత్రణ కమిటీలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లు, హోల్‌సేల్‌ వ్యాపారుల కుమ్మక్కుతో ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. తనిఖీల పేరుతో హడావుడి చేయడం కాకుండా నిల్వల వివరాలు సేకరించి, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.