మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 18, 19 తేదీల్లో భారీ వర్షాలు!
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈనెల 18 నుంచి 20 వరకు భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రాలో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

AP Cyclone Alert
48గంటల్లో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుండటంతో అది నవంబర్ 15 నాటికి వాయుగుండంగా, నవంబర్ 16 సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా(AP Cyclone Alert) మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని తెలిపింది. వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ తదుపరి ప్రయాణ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వివిధ వాతావరణ నమూనాల అంచనాల్లోనూ కొంత వ్యత్యాసం కనిపిస్తోంది.
18నుంచి 20వ వరకు భారీ వర్షాలు
ఐఎండీ హెచ్చరికల ప్రకారం కోస్తాంధ్రలో నవంబర్ 18 నుంచి వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. నవంబర్ 19న కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. నవంబర్ 20న కోస్తాంధ్రలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు. తుపాను(AP Cyclone Alert) ప్రభావంతో బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గంటకు 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉండగా, నవంబర్ 17 నుంచి కొన్ని సముద్ర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్ 15లోగా సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించింది. నవంబర్ 20 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వార్నింగ్ ఇస్తోంది. అలాగే కోస్తాంధ్రాలో వరిపంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
Paddy farmers who are about to harvest paddy crops in coastal Andhra pradesh. Do it immediately before Nov 18th ✅
కోస్తాంధ్రా లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాను . ✅
— Vizag weatherman🇮🇳 (@vizagweatherma9) November 14, 2026
ప్రభుత్వం అలర్ట్
వాతావరణ నమూనాల ప్రకారం ఈ తుపాను వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? లేక సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. తుపాను(AP Cyclone Alert) ప్రయాణ దిశ, తీవ్రతలో మార్పులను ఐఎండీ అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏపీ అర్నబ్, మురసు లాంటి వరుస తుపానుల ప్రభావాన్ని ఎదుర్కొవడంతో మరో వాతావరణ ముప్పు పొంచి ఉండటం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.



