Andhra Pradesh Delimitation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశం ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు ప్రతిపాదనలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల అమలుకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు అమల్లోకి వస్తే ఏపీ పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు, మహిళలకు దక్కనున్న ప్రాతినిధ్యం, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

175 నుంచి 263కు అసెంబ్లీ స్థానాలు

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కు చేరనున్నాయి. అంటే అదనంగా 88 స్థానాలు రానున్నాయి. అదే విధంగా ప్రస్తుతం 25గా ఉన్న లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవి 21కి చేరనున్నాయి. కర్నూలులోనూ 14 నుంచి 21కి పెరగనున్నాయి. కడపలో 10 స్థానాలు 15కు, చిత్తూరులో 14 స్థానాలు 21కి చేరనున్నాయి. నెల్లూరులో ప్రస్తుతం ఉన్న 10 స్థానాలు 15కు, ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు 18కి పెరగనున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 74 స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత 111కి చేరనున్నాయి.

కోస్తా జిల్లాల్లోనూ మారనున్న రాజకీయ సమీకరణాలు

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పునర్విభజన తర్వాత 25కి పెరగనున్నాయి. కృష్ణా జిల్లాలోనూ సీట్ల సంఖ్య 24కు చేరనుంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 49 అసెంబ్లీ స్థానాలు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కూటమి రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు తర్వాత వైసీపీ తన బలాన్ని ఎంతవరకు పెంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో అధికారాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. తూర్పు గోదావరిలో ప్రస్తుతం 19 స్థానాలు ఉండగా, అవి 28కి చేరనున్నాయి. పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు 22కి పెరగనున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం ఉన్న 34 స్థానాలు 50కి చేరనున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రలో 53 అసెంబ్లీ స్థానాలు

ఉత్తరాంధ్రలోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 15 స్థానాలు ఉండగా అవి 23కి చేరనున్నాయి. విజయనగరంలో 9 స్థానాలు 15కు, శ్రీకాకుళంలోనూ స్థానాల సంఖ్య 15కు పెరగనుంది. దీంతో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు పునర్విభజన తర్వాత 53కి చేరనున్నాయి. ఈ మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఉన్న బలాబలాలు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి, వైసీపీ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

అధికారానికి 132 సీట్లు.. ప్రతిపక్ష హోదాకు 26

అసెంబ్లీ స్థానాలు 263కి పెరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త లెక్కల ప్రకారం ఏపీలో అధికారం చేపట్టాలంటే కనీసం 132 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ప్రతిపక్ష హోదా పొందాలంటే 26 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న పరిమితుల ప్రకారం మంత్రివర్గంలో గరిష్టంగా 39 మంది వరకు అవకాశం ఉండనుంది. అసెంబ్లీ స్థానాల పెంపుతో పాటు శాసనమండలి సభ్యుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం 58గా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 88కి చేరనున్నాయి. లోక్‌సభలో ఏపీ ప్రాతినిధ్యం కూడా 25 నుంచి 38 స్థానాలకు పెరగనుంది. దీంతో చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాతినిధ్యం పెరగడంతో పాటు రాజకీయంగా మరింత మందికి అవకాశాలు లభించనున్నాయి.

మహిళలకు పెరగనున్న ప్రాతినిధ్యం.. నేతలకు కొత్త అవకాశాలు

మహిళా రిజర్వేషన్ల అమలుతో అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగనుంది. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు, మహిళలకు కేటాయించే స్థానాలు రాజకీయ పార్టీలకు కొత్త సవాళ్లను తీసుకురానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ పార్టీలకు పోటీ చేసే అవకాశాలు విస్తరించనున్నాయి.