China Fake Gold in India: బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు కొంటున్నది నిజమైన బంగారమేనా..? లేక బంగారం రంగులో కనిపించే మరో మెటల్‌.? మీ కళ్ల ముందే స్వచ్ఛమైన బంగారంలా కనిపిస్తూ, ఆధునిక యంత్రాల పరీక్షల్లోనూ అసలైన బంగారంలా తేలుతూ.. చివరకు మీ జేబుకు భారీ చిల్లు పెట్టే కొత్త తరహా కల్తీ దందా వెలుగులోకి వచ్చినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. చైనా నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ వ్యవహారం ఇప్పుడు బంగారం కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా బంగారంలో స్వచ్ఛతను తగ్గించేందుకు రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలుపుతుంటారు. అయితే ఇప్పుడు కల్తీ మాఫియా అంతకుమించి ఆలోచించింది. బంగారం కంటే అధిక సాంద్రత కలిగిన రీనియం అనే అరుదైన లోహాన్ని పొడి రూపంలో బంగారంలో కలుపుతున్న వీడియోలు పసిడి ప్రియులను భయపెడుతుంది.

చైనాలో తయారీ.. భారత్‌లోకి అక్రమ రవాణా

ఈ కొత్త తరహా కల్తీ వెనుక చైనా మూలాలు ఉన్నట్లు పరిశోధనాత్మక విచారణలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చైనాలోని షెన్‌జెన్ ప్రాంతంలో రీనియం పొడిని తయారు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ముంబై, పశ్చిమ బెంగాల్ మార్గాల ద్వారా భారత మార్కెట్లోకి ఈ పొడి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన బృందం ముంబైకి చెందిన ఓ ఏజెంట్ ద్వారా రూ.5 వేలు చెల్లించి ఒక గ్రాము రీనియం పొడిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అనంతరం 7.83 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారానికి ఈ రీనియం పొడిని కలిపి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక ఆభరణాన్ని తయారు చేయించినట్లు సమాచారం. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ ఆభరణాన్ని పరీక్షించినప్పుడు సాధారణ బంగారం పరీక్షా కేంద్రాలు సైతం అందులోని కల్తీని గుర్తించలేకపోయినట్లు కథనాలు చెబుతున్నాయి.

హాల్‌మార్క్ ఉన్నా నాణ్యతకు గ్యారెంటీ లేదా..?

బంగారం కొనుగోలుదారులకు సాధారణంగా హాల్‌మార్క్‌పై నమ్మకం ఉంటుంది. హాల్‌మార్క్ ఉందంటే బంగారం స్వచ్ఛమైనదేనని చాలామంది భావిస్తారు. కానీ ఈ కొత్త తరహా కల్తీ ఆరోపణలు ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రీనియం కలిపినట్లు చెబుతున్న ఆభరణాన్ని పలు షోరూమ్‌లు, హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో పరీక్షించినప్పటికీ, అందులోని రీనియంను గుర్తించలేకపోయినట్లు సమాచారం. అంటే బయటకు కనిపించే ముద్ర ఒకలా ఉంటే, లోపల ఉన్న లోహాల కూర్పు మరోలా ఉండే ప్రమాదం ఉందన్నమాట. రీనియం, ఇరిడియం, ఓస్మియం వంటి అధిక సాంద్రత కలిగిన లోహాలను బంగారంలో కలిపితే సాధారణ పరీక్షల్లో గుర్తించడం కష్టమవుతుందని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ కొత్త తరహా కల్తీ వ్యవహారం నేపథ్యంలో బంగారం మార్కెట్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి ఇలాంటి చౌకైన లోహపు పొడులు పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి వస్తే, తక్కువ ఖర్చుతో అధిక బరువున్న ఆభరణాలను తయారు చేసే ప్రయత్నాలు జరగవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.

బీకేర్ ఫుల్ గోల్డ్ ప్రియులారా..

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు. అది ఒక పెట్టుబడి, కుటుంబ ఆస్తి, కష్టకాలంలో ఆదుకునే భరోసా. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల కోసం జీవితకాలం పొదుపు చేసిన డబ్బును బంగారంపై ఖర్చు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా, సాధారణ పరీక్షల్లోనే దొరకని స్థాయిలో కల్తీ జరుగుతోందనే ఆరోపణలు నిజమైతే కొనుగోలుదారులకు ఇది పెద్ద హెచ్చరికే. బంగారం ధరలు పతనం అవడానికి చైనా నుంచి దిగుమతి అవుతున్న రీనియం ఫౌడర్ కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే హాల్‌మార్క్ ఉందని మాత్రమే గుడ్డిగా నమ్మే రోజులు పోయి.. బంగారం కొనుగోలు చేసే ముందు దాన్ని ల్యాబ్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మీ కళ్లకు బంగారంలా కనిపించేది నిజంగా బంగారమేనా అన్నది నిర్ధారించుకోకుండా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకండి.