మూడుసార్లు దెయ్యాన్ని చూశా..పోప్ డైరీలో సంచలన విషయాలు
Pope Francis On Devil: భూమ్మీద దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..? పోప్ ఫ్రాన్సిస్ రాసిన డైరీలో దెయ్యాల గురించి ఎందుకు రాశారు..? ఇప్పుడు ఇదే వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది..

Pope Francis On Devil: దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలోని కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆధ్యాత్మిక సంఘర్షణలు, భయాలు, పశ్చాత్తాపం, మానసిక వేదనకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ డైరీ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, తన జీవితంలో మూడుసార్లు దెయ్యాన్ని చూశానని, ఒకసారి నరక ద్వారాలను సైతం దర్శించినట్లు ఆయన రాసుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నిజంగానే దెయ్యాలు ఉన్నాయా..? అనే సందేహం ఇప్పుడు మొదలైంది.
1992 నుంచి 2024 వరకు డైరీలో నమోదు
పోప్ ఫ్రాన్సిస్ 1992 నుంచి 2024 మధ్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలను డైరీలో నమోదు చేశారు. ఈ రాతల ఆధారంగా ఇటీవల ది పర్సనల్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఆయన మరణానంతరం వారసుడు పోప్ లియో XIV అనుమతితో డైరీలోని కొన్ని భాగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తన జీవితంలో మొత్తం మూడుసార్లు దెయ్యాన్ని చూసినట్లు పోప్ ఫ్రాన్సిస్ డైరీలో పేర్కొన్నారు. మొదటిసారి కారులో ప్రయాణిస్తున్న సమయంలో దాని కళ్లను చూసినట్లు రాశారు. రెండోసారి బ్యూనస్ ఎయిర్స్‌లోని కార్మెలైట్ ప్రార్థనా మందిరంలో అగ్నిజ్వాలల్లాంటి కళ్లతో దెయ్యం కనిపించినట్లు వివరించారు. ఇక మూడోసారి చిలీ పర్యటన అనంతరం రోమ్‌లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా దాని ఉనికిని గుర్తించినట్లు పేర్కొన్నారు. 2021 జనవరి 24న రాసిన డైరీ నోట్‌లో ఈ అనుభవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దెయ్యం తనకు భౌతికంగా కనిపించిందని తాను నమ్ముతున్నట్లు ఆయన స్పష్టంగా రాసుకున్నారు.
నరక ద్వారాలను చూసిన భయానక అనుభవం
పోప్ ఫ్రాన్సిస్ డైరీలో మరో ఆసక్తికరమైన అంశం 2018 జూన్ 7న రాసిన నోట్. అంతకుముందు రాత్రి తాను నరక ద్వారాలను చూసినట్లు అందులో వెల్లడించారు. ఆ దృశ్యం తనను తీవ్రంగా భయపెట్టిందని పేర్కొన్నారు. ఆ భయంతో వెంటనే జపమాలను చేతిలోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని అభివర్ణించారు. 2025 ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత వ్యక్తిగత డైరీలోని కొన్ని భాగాలు పుస్తకంగా ప్రచురితం కావడంతో ఈ అనుభవాలు వెలుగులోకి వచ్చాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎదుర్కొన్న భయాలు, సంఘర్షణలు, అసాధారణ అనుభవాల గురించి వెల్లడైన ఈ విషయాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మూడుసార్లు దెయ్యాన్ని చూశానని, నరక ద్వారాలను దర్శించినట్లు రాసుకున్న అంశాలు ఈ డైరీలో అత్యంత చర్చనీయాంశాలుగా నిలిచాయి.



