ఏపీకి భారీ వర్ష సూచన. నెల్లూరును ముంచెత్తిన భారీ వర్షం..!
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాను భారీ వర్షం ముంచెత్తుతోంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

AP Weather Update
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాను భారీ వర్షం ముంచెత్తుతోంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో కురిసిన భారీ వాన(AP Weather Update)తో ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.లోతట్టు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లపైకి చేరుతోంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటమే కాకుండా, కొన్ని కాలనీల్లో సాధారణ జనజీవనం స్తంభించింది.
పలు జిల్లాలకు అలెర్ట్!
ద్రోణి ప్రభావంతో నెల్లూరుతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు(AP Weather Update) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.గురువారం (నవంబర్ 26) పోలవరం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాయలసీమలోను వర్షాలు
ఇక శుక్రవారం (నవంబర్ 27) రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (AP Weather Update)కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందకూడదని హెచ్చరించారు.



