విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Vijay Antony Promotions: విజయ్ ఆంటోని.. ఆయన తీసే సినిమాలు సరికొత్త మెసేజ్‌ను ఇస్తాయి. అలాంటి హీరో ఇప్పుడు నాన్నకుట్టి పేరుతో థియేటర్లలోకి రాబోతున్నారు. సినిమా ప్రమోషన్లను తానే భుజానా వేసుకొని.. బజ్జీలు వేయడం, ట్రైన్ జనరల్ భోగీల్లో ప్రయాణిస్తున్న ఆడియన్స్‌కు దగ్గరవుతున్నారు..

Vijay Antony Promotions: సినిమా విడుదలవుతుందంటే చాలు.. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ప్రమోషన్లతో బిజీ అయిపోతారు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. టీవీ షోలు, ఇంటర్వ్యూలు, థియేటర్ విజిట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సందడి చేస్తుంటారు. కానీ తమిళ హీరో విజయ్ ఆంటోనీ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా తనదైన శైలిలో సినిమా ప్రచారం చేస్తున్నారు. భారీ హంగులు, ఆర్భాటాలకు దూరంగా సామాన్యుల మధ్యకు వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
జనరల్ బోగీలో ప్రయాణం.. ప్రయాణికులతో ముచ్చట్లు
తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న నాన్నకుట్టి సినిమా కోసం విజయ్ ఆంటోనీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఓ రైలులో జనరల్ బోగీలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా రైలు ఎక్కి, తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ క్రమంలో తన సినిమా గురించి వివరిస్తూ.. అందరూ సినిమాను ఆదరించాలని కోరారు. సాధారణంగా స్టార్ హీరోలు బయటకు వస్తే లగ్జరీ కార్లు, క్యారవాన్లు, ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తుంటాయి. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం ఎలాంటి హంగామా లేకుండా రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుని జనరల్ బోగీలో ప్రయాణించడం విశేషం. తమ అభిమాన హీరో నేరుగా తమ మధ్యకు రావడంతో ప్రయాణికులు సైతం ఆశ్చర్యపోయారు.
హోటల్‌లో బజ్జీలు వేసిన హీరో
ఇక నాన్నకుట్టి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విజయ్ ఆంటోనీ మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. నేరుగా ఏషియన్ సత్యం మాల్ వద్దకు వెళ్లిన ఆయన.. అక్కడి చిన్న కాకా హోటల్‌లోకి వెళ్లారు. అక్కడ స్వయంగా బజ్జీలు వేస్తూ కనిపించారు. అనంతరం మరో హోటల్‌లో బన్ మస్కా, చాయ్ ఆస్వాదించారు. అంతేకాదు.. అక్కడున్న వారితో సరదాగా ముచ్చటిస్తూ తన సినిమాను ఆదరించాలని కోరారు.అక్కడి నుంచి మెట్రో రైలులో ప్రయాణించి విజయ్ ఆంటోని.. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ముందుకు సాగారు. ఓ స్టార్ హీరో ఇలా నేరుగా హోటల్‌కు వచ్చి బజ్జీలు వేయడం, సామాన్యులతో కలిసి సమయం గడపడం చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిచ్చగాడుతో గుర్తింపు.. ఇప్పుడు వినూత్న ప్రమోషన్స్
విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బిచ్చగాడు. ఆ సినిమాతో ఆయన ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా అదే సరళమైన శైలిలో ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం కంటే.. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయ్ ఆంటోనీ ప్రమోషన్ శైలిని చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఇలా సామాన్యుల మధ్యకు వస్తే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు.నాన్నకుట్టి సినిమా కోసం విజయ్ ఆంటోనీ చేస్తున్న ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.



