యూపీ ఎన్నికల సమరం.. బీజేపీ వ్యూహాలు.. కాంగ్రెస్-ఎస్పీ మధ్య సీట్ల పంచాయితీ
Uttar Pradesh Elections 2027: యూపీ ఎన్నికల సమరం.. మూడోసారి అధికారం కోసం బీజేపీ వ్యూహాలు.. కాంగ్రెస్-ఎస్పీ మధ్య సీట్ల పంచాయితీ..అయోధ్య తర్వాత మథురపై బీజేపీ గురి..

Uttar Pradesh Elections 2027: దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ రాష్ట్రం.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. అందుకే ఉత్తరప్రదేశ్‌ను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. ఇక్కడ విజయం సాధించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ తమ బలాన్ని చాటుకోవాలని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి.
2027 ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాల గురి
ఈ నేపథ్యంలో 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2017, 2022 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు గత రెండు ఎన్నికల్లోనూ పరాజయం పాలైన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న ఎస్పీకి సీట్ల పంపకం మాత్రం పెద్ద సవాలుగా మారుతోంది. దీంతో ఎన్నికల సమరానికి ముందే యూపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
అయోధ్య తర్వాత మథురపై బీజేపీ ఫోకస్..
గత ఎన్నికల్లో అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ.. హిందూ ఓటర్లలో తన రాజకీయ మద్దతును బలోపేతం చేసుకుంది. ఇప్పుడు 2027 ఎన్నికల నేపథ్యంలో మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి అంశం కూడా రాజకీయ చర్చల్లోకి వస్తోంది. మథురలో కృష్ణుడి జన్మస్థలానికి సంబంధించిన ఆలయ నిర్మాణ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. నవంబర్ 16, 17 తేదీల్లో మథురలో జరిగిన బీజేపీ కీలక సమావేశాల్లో 2027 ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగింది. శ్రీకృష్ణ జన్మభూమితో పాటు అభివృద్ధి, శాంతిభద్రతలు, మహిళల భద్రత, సంక్షేమ పథకాల అమలును ప్రధాన ప్రచార అంశాలుగా తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా యాదవ సామాజికవర్గం రాజకీయంగా ప్రభావం చూపే ప్రాంతాల్లోనూ తన పట్టు పెంచుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
320 సీట్లు గెలుస్తామంటున్న యోగి
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 202 స్థానాలు అవసరం. 2022 ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 255 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి 273 స్థానాలను సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఈసారి కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 320 స్థానాలు సాధించాలనే లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే మథుర, వారణాసి అంశాలు కేవలం ఎన్నికల అజెండాలు కావని, భారతీయ నాగరికతకు సంబంధించిన అంశాలని యోగి ఆదిత్యనాథ్ గతంలో స్పష్టం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమమేనని చెబుతున్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకున్నామని, నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు తీసుకొచ్చామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది.
180 సీట్ల డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్.. ఎస్పీ మాత్రం 24కే మొగ్గు..?
మరోవైపు బీజేపీని ఎదుర్కొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు సుమారు 24 స్థానాలు కేటాయించాలనే ప్రతిపాదనను ఎస్పీ ముందుకు తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన అనేక నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయిందని, కొన్ని చోట్ల అభ్యర్థులకు 10 వేల నుంచి 20 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఎస్పీ తన వాదనకు ఆధారంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రంఏకంగా 180 స్థానాల వరకు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2024 లోక్‌సభ ఫలితాలే కాంగ్రెస్‌కు ధైర్యం..
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కలిసి పోటీ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఫలితాలు ప్రతిపక్ష కూటమికి కొత్త ఆశలు కల్పించాయి. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పీడీఏ రాజకీయ వ్యూహం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో తన రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవాలని చూస్తోంది. యూపీ ఎన్నికల్లో కేవలం మతపరమైన అంశాలే కాకుండా కుల సమీకరణాలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళల భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. బీజేపీ తన అభివృద్ధి, శాంతిభద్రతల అజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుండగా.. ఎస్పీ సామాజిక న్యాయం, కులగణన, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకునే పరీక్ష కాగా.. సమాజ్‌వాదీ పార్టీకి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునే పోరాటం. కాంగ్రెస్‌కు మాత్రం రాష్ట్రంలో తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకునే అవకాశం. మథుర సెంటిమెంట్, అయోధ్య ప్రభావం, అభివృద్ధి నినాదం ఒకవైపు.. పీడీఏ వ్యూహం, ప్రతిపక్ష ఐక్యత మరోవైపు.. ఇలా యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.



