Congress Moves Supreme Court: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణలతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. తాజాగా ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది. ఎన్నికల సంఘం నుంచి తమ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావడం లేదని ఆరోపిస్తూ.. 48 ప్రశ్నలతో కూడిన జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు వెల్లడించింది.

సుప్రీంకోర్టు అనుమతి కోరిన ఇండియా కూటమి

ఎన్నికల సంఘం ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాము లేవనెత్తిన అనేక సందేహాలకు సమాధానాలు లేవని కాంగ్రెస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, సంబంధిత అధికారులను నేరుగా ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇండియా కూటమి సుప్రీంకోర్టును కోరింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఎలా తీసుకుంటోంది? వాటి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ముఖ్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలు, వాటి అమలు తీరుపై సమాధానాలు కోరుతోంది.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా టార్గెట్‌గా ప్రశ్నలు

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిప్రాయాలతో మిగతా ఇద్దరు కమిషనర్లు ఎన్ని సందర్భాల్లో విభేదించారు? కీలక నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకుంటున్నారా? భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎవరి నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్న ప్రశ్నలను లేవనెత్తింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని నిర్ణయించింది ఎవరు? ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో మార్పులు చేయాలని ఎవరు నిర్ణయించారు? ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన వ్యవస్థలను కేంద్రీకరించడం వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపైనా వివరణ కోరింది. ఈ ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న లోపాలపై కూడా ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లు, సమాచార సాంకేతిక విభాగం ఉన్నతాధికారిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.

ఓట్ చోరీపై ఆందోళనలు మరింత ఉధృతం

మరోవైపు ఓట్ల చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. తొలుత నవంబర్ 26తో ముగించాలని భావించిన ఆందోళనలను డిసెంబర్ 15 వరకు పొడిగించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి దశ ఉద్యమానికి ‘ఓటు రక్షక్’ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 26న దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రాజ్యాంగ పరిరక్షణ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇతర కమిషనర్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో 48 ప్రశ్నలను ముందుంచిన కాంగ్రెస్.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తన పోరాటాన్ని న్యాయపరంగానూ, రాజకీయంగానూ కొనసాగించేందుకు సిద్ధమైంది.