Aadhav Arjuna Daisy Martin Announce Divorce: తమిళ రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు మంత్రి, టీవీకే నేత ఆధవ్ అర్జున, ఆయన భార్య డెయిసీ మార్టిన్ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. 14 ఏళ్ల పాటు కొనసాగిన తమ దాంపత్య బంధం నుంచి బయటకు రావాలని ఇద్దరూ పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నట్లు డెయిసీ మార్టిన్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డెయిసీ

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో డెయిసీ మార్టిన్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. గత 14 సంవత్సరాలుగా తమ మధ్య కొనసాగిన బంధం ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహనతో సాగిందని ఆమె పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మార్పులు ఎదుర్కొన్నామని తెలిపారు. స్నేహితులుగా మొదలై, జీవిత భాగస్వాములుగా మారి, ఆ తర్వాత తల్లిదండ్రులుగా కలిసి బాధ్యతలు పంచుకున్న తమ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.

పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం: డెయిసీ మార్టిన్

అయితే, జీవితంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఇకపై భార్యాభర్తలుగా కలిసి కొనసాగడం కంటే, వ్యక్తిగతంగా వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగడమే సరైన నిర్ణయమని ఇద్దరూ భావించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎవరి ఒత్తిడితోనో తీసుకున్నది కాదని, ఇద్దరి అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రకటన ద్వారా తెలియజేశారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు మాత్రం కొనసాగుతాయని డెయిసీ మార్టిన్ స్పష్టం చేశారు. తమకు అన్నింటికంటే ముఖ్యమైనది బిడ్డ శ్రేయస్సేనని పేర్కొన్నారు. కుమార్తె శ్రేయస్సు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులుగా ఇద్దరం కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తామని తెలిపారు. భార్యాభర్తలుగా విడిపోయినా, బిడ్డకు అవసరమైన ప్రేమ, సంరక్షణ అందించడంలో ఎలాంటి లోటు రానివ్వబోమనే విషయాన్ని ఆమె తన ప్రకటనలో స్పష్టం చేశారు.

లాటరీ కింగ్ మార్టిన్ కుమార్తె డెయిసీ

డెయిసీ మార్టిన్ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన శాంటియాగో మార్టిన్ కుమార్తె. లాటరీ వ్యాపారంతో గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబానికి చెందిన ఆమె కూడా వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 14 ఏళ్ల క్రితం ఆధవ్ అర్జునతో ఆమె వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ భార్యాభర్తలుగా తమ జీవితాన్ని కొనసాగించారు. మరోవైపు ఆధవ్ అర్జున రాజకీయాల్లోకి రాకముందు క్రీడా రంగంలోనూ గుర్తింపు పొందారు. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ ప్రస్థానంలో తొలుత వీసీకే పార్టీలో పనిచేసిన ఆయన, అనంతరం నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగంలో చేరారు. ప్రస్తుతం తమిళనాడు కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.

డీఎంకే అధినేత స్టాలిన్‌పై అసెంబ్లీలో విమర్శలు

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్టాలిన్ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తన మామ శాంటియాగో మార్టిన్ నుంచి స్టాలిన్ ఎన్ని మూటలు తీసుకున్నారో తమకు తెలుసంటూ ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా అథవ్ మారన్ విడాకుల వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురువు బాటలో శిష్యుడు కూడా నడుస్తున్నారంటూ విజయ్‌ను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. దీంతో అథవ్ విడాకుల వ్యవహారం కేవలం వ్యక్తిగత అంశంగానే కాకుండా సోషల్ మీడియాలో రాజకీయ చర్చకు కూడా దారితీసింది.