ఏపీకి మళ్లీ తుపాను టెన్షన్.. వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు
Andhra Pradesh Cyclone Alert: ఏపీని వరుసగా తుపానులు వెంటాడుతున్నాయి. అర్నబ్, మురసు తుపాన్లతో పోయిందనుకుంటే ఇప్పుడు మరో తుఫాన్ అలజడి రేపుతోంది. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.

Andhra Pradesh Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల ముప్పు తప్పడం లేదు. వరుసగా ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల క్రితం అర్నబ్ తుపాను ప్రభావం నుంచి తేరుకోకముందే.. పదిహేను రోజుల క్రితం మురసు ముప్పు పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు మరో తుపాను దూసుకొస్తుండటంతో అన్నదాతల్లో గుబులు మొదలైంది.
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది సోమవారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి తీవ్ర తుపానుగా మారవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతోంది. అయితే తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. తుపాను ముప్పు నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ 18 వరకు నైరుతి బంగాళాఖాతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
@moesgoi @ndmaindia @DDNewslive
— India Meteorological Department (@Indiametdept) November 15, 2026
అప్రమత్తమైన కోస్ట్ గార్డ్
తుపాను హెచ్చరికలతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే రంగంలోకి దిగేందుకు నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచింది. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల పరిసర జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులో ఆదివారం, సోమవారం మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నైలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అన్నదాతల్లో మొదలైన ఆందోళన
ఒకదాని వెంట మరొకటి తుపాన్లు ముంచుకొస్తుండటంతో ఏపీ రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే అర్నబ్, మురసు తుపాన్ల ముప్పుతో కలవరపడిన రైతులకు.. ఇప్పుడు మరో తుపాను వార్త ఆందోళన కలిగిస్తోంది. కొత్త తుపాను ప్రభావం ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం తుపాను కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మురస, అర్నబ్ తుపాను దాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి వర్షాల నేపథ్యంలో రైతుల్లో అలజడి మొదలైంది..



