Rushikonda Palace: ఢిల్లీలో బీజేపీ ప్రయోగించిన శీష్ మహల్ అస్త్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సమయంలో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం విలాసవంతమైన నిర్మాణం అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనంలోని ఇంటీరియర్, ఫర్నిచర్, విలాసవంతమైన వస్తువులను ధరలతో సహా వీడియో రూపంలో ప్రజలకు చూపించింది. ఇప్పుడు ఏపీలోనూ దాదాపు ఇదే తరహా పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ చర్చంతా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ చుట్టూనే తిరుగుతోంది.

రుషికొండ ప్యాలెస్.. ఇక ప్రజల ముందుకు

వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవన సముదాయం మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.సుమారు రూ.452 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాల వినియోగంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంగణాన్ని మొదట నాలుగు నెలల పాటు సాధారణ ప్రజలు, పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం 120 రోజుల పాటు సందర్శనకు అనుమతిస్తూ టికెట్ విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ప్రవేశ రుసుము ఎంత ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు బయట నుంచి మాత్రమే చూసిన ఈ భవనాల లోపలి విలాసాలను ప్రజలు స్వయంగా చూసే అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది..

గోడల నుంచి గృహోపకరణాల వరకు.. ప్రతిదానికీ ధరల చిట్టా..?

ఇక్కడే అసలు ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. ఢిల్లీలోని శీష్ మహల్ తరహాలో రుషికొండ భవనాల్లోనూ విలాసవంతమైన వస్తువులకు ధరల ట్యాగులు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. భవనాల ఇంటీరియర్, ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్, తలుపులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోలు వ్యయాన్ని ప్రజలకు తెలియజేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.అదే జరిగితే రుషికొండ నిర్మాణంలో ఏయే వస్తువులు ఉపయోగించారు..? వాటి కోసం ఎంత ఖర్చు చేశారు..? అన్న వివరాలు సందర్శకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ భవనాల నిర్మాణ వ్యయంపై మరోసారి చర్చ మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

స్టార్ హోటల్‌గా మార్పు.. ప్రైవేటు సంస్థలకు అప్పగింత

మరోవైపు రుషికొండ ప్యాలెస్‌ను శాశ్వతంగా ప్రభుత్వ నిర్వహణలో ఉంచకుండా పీపీపీ విధానంలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటల్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆతిథ్య రంగంలో అనుభవం ఉన్న ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించి, నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థను ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా నియమించాలనే ప్రతిపాదన కూడా ఉంది. 120 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఢిల్లీలో శీష్ మహల్ చుట్టూ సాగిన రాజకీయ చర్చ ఇప్పుడు ఏపీలో రుషికొండ ప్యాలెస్‌కు చేరింది. నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనకు అవకాశం, ఆ తర్వాత స్టార్ హోటల్‌గా రూపాంతరం.. ఈ రెండు పరిణామాలతో రుషికొండ భవన సముదాయం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారనుంది.