తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఇతనే..?
TTD gold donations: తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడి పేరుతో బయటకు వచ్చింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్దమాన్ జైన్ అని టీటీడీలో జోరుగా చర్చ జరుగుతోంది.

TTD gold donations: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై భక్తులు తమకున్న అపారమైన భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటుంటారు. కొందరు నగదు రూపంలో విరాళాలు అందిస్తే.. మరికొందరు బంగారం, ఆభరణాలను సమర్పిస్తూ స్వామివారి సేవలో భాగస్వాములవుతుంటారు. అయితే తాజాగా శ్రీవారికి ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా అందించనున్నారనే వార్త దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంత భారీ మొత్తంలో బంగారం సమర్పించనున్న ఆ భక్తుడు ఎవరనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
వర్ధమాన్ జైన్ పేరుతో ప్రచారం..!
తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళంగా ప్రకటించిన భక్తుడు చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన ఏషియన్ ఇంజినీరింగ్ సంస్థతో సంబంధం సమాచారం.అంతేకాకుండా యాక్సెస్ హెల్త్ కేర్, వరా ఫ్యూచర్ ఎల్ఎల్పీ కంపెనీలను నడుపుతున్నారు. 2025 యాక్సెస్ హెల్త్ కేర్‌లో 70 శాతం నుంచి 75 శాతం మేర వాటాను అమెరికా కంపెనీకి విక్రయించారు.గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించడం ద్వారా వచ్చిన నిధులతో శ్రీవారికి 121 కేజీల బంగారాన్ని సమర్పించనున్నట్లు ఓ భక్తుడు ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లోనే భక్తుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు వర్దమాన్ జైన్ పేరు తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. వర్దమాన్ జైన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బంగారం విరాళానికి సంబంధించిన పత్రాలను వర్దమాన్ జైన్‌కు అప్పగించినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
శ్రీవారి సన్నిధిలో అపురూప ఆభరణాల వైభవం
తిరుమల శ్రీవారి గర్భాలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకరణ కోసం సుమారు 650 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటిలో పొదిగిన వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు తదితర విలువైన రత్నాలను కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం విలువ రూ.10 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆకాశరాజు కాలం నుంచి వివిధ రాజులు, పాలకులు, పారిశ్రామికవేత్తలు, భక్తులు తమ భక్తికి చిహ్నంగా ఒక్కో ఆభరణాన్ని స్వామివారికి సమర్పిస్తూ వచ్చారు. అయితే టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒకే భక్తుడు ఒకేసారి 121 కిలోల ఆభరణాల సముదాయాన్ని కానుకగా అందించడం విశేషంగా నిలిచింది.
ప్రముఖులు సమర్పించిన స్వర్ణాభరణాలు.. భక్తుల అపూర్వ కానుకలు
శ్రీవారికి ఆభరణాలు సమర్పించిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర హేచరీస్ సంస్థ 13 కిలోల కిరీటాన్ని, సంజీవ్ గోయెంకా 10 కిలోల బంగారు కిరీటాలను అందించారు. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ సహస్రకలశాభిషేకం కోసం 108 బంగారు పుష్పాలను సమర్పించగా, 2003లో లలిత జ్యూవెలరీ అధినేత కిరణ్ కూడా 108 స్వర్ణ పుష్పాలను అందించారు. 2009లో గాలి జనార్దనరెడ్డి రూ.42 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలను సమర్పించింది. రామలింగరాజు విరాళంతో రూ.11 కోట్ల వ్యయంతో సహస్రనామ కాసుల బంగారు హారం తయారుచేయించి చంద్రబాబు చేతుల మీదుగా స్వామివారికి అందించారు. లలిత్ బాసిన్ బంగారు గంగాళం, పాత్రలు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి 20 కిలోల బంగారు పీతాంబరాలు సమర్పించారు. 2021లో ఎం అండ్ సీ ప్రాపర్టీస్ 3.604 కిలోల బంగారు బిస్కెట్లు ఇవ్వగా, అదే ఏడాది ఓ అజ్ఞాత భక్తుడు 5.3 కిలోల బంగారు కఠి, వరద హస్తాలను అందించారు. తమిళనాడుకు చెందిన తంగదొరై పలుమార్లు విలువైన ఆభరణాలను సమర్పించగా, సంజీవ్ గోయెంకా గతేడాది మే నెలలో మరోసారి బంగారు కఠి, వరద హస్తాలను కానుకగా ఇచ్చారు. తిరుమల ఆలయ గర్భగుడి ముందుభాగానికి బంగారు తాపడం చేయించడంలో విజయ్ మాల్యా కూడా తన వంతు సహకారం అందించారు.



