Chandrababu Reacts Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిలతో చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారంటూ సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సాక్షి పత్రిక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక కుటుంబానికి సంబంధించిన శుభకార్యాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

షర్మిల ఆహ్వానిస్తే రాజకీయం చేస్తారా: సీఎం చంద్రబాబు

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు తన వద్దకు వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని సాక్షి పత్రిక మరో కోణంలో ప్రచారం చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. షర్మిల తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తే అందులో రాజకీయాలు వెతకడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో షర్మిల వివాహ సమయంలో ఆమె తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా తనను ఆహ్వానించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ వివాహ వేడుకకు తాను హాజరైనట్లు తెలిపారు. అలాగే వైఎస్ జగన్ వివాహానికి కూడా పులివెందులకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అప్పట్లో కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నామని ఆయన వ్యాఖ్యల సారాంశం.

వైఎస్‌ఆర్‌తో పాత స్నేహాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు

ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. 1978 నుంచి 1983 వరకు తామిద్దరం మంచి మిత్రులుగా ఉన్నామని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తాను తెలుగుదేశం పార్టీలో చేరగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ రాజకీయంగా తనతో పోరాడారని వివరించారు. రాజకీయంగా ఎంతటి హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు వైఎస్‌ఆర్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలతోనూ తాను రాజకీయ పోరాటాలు చేశానని తెలిపారు. గతంలో సిద్ధాంతాల కోసం పోరాడామని, ప్రస్తుతం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సొంత చెల్లి, రక్తం పంచుకున్న వ్యక్తి విషయంలోనూ ఇలాంటి కథనాలు రావడం సరికాదని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నవంబర్ 25న అంజలి రెడ్డి వివాహం

మరోవైపు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నవంబర్ 25న జరగనుంది. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో ఆమె వివాహం గతంలోనే నిశ్చయమైంది. తొలుత బెంగళూరులోని యలహంక భవనంలో పెళ్లి నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, జగన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వేదికను మార్చినట్లు ప్రచారం జరిగింది. అయితే కొత్త వివాహ వేదిక వివరాలను ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉండగా అంజలి రెడ్డి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో షర్మిల, ఆమె భర్త అనిల్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నేతలు కూడా ఈ ఫొటోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మొత్తంగా అంజలి రెడ్డి వివాహ ఆహ్వానం చుట్టూ మొదలైన చర్చ, సాక్షి కథనం, చంద్రబాబు స్పందనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.