MOUల నుంచి గ్రౌండింగ్ వరకు.. పెట్టుబడులపై లోకేశ్ ఫోకస్
Nara Lokesh Andhra Pradesh Investments: ఏపీలో మంత్రి లోకేశ్ తనదైన మార్క్ పాలన సాగిస్తున్నారు. ఏపీలోని రాయలసీమలో అతిపెద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్ ప్రారంభమైంది. కేవలం పన్నెండు నెలల్లో ప్లాంట్‌ను ఓపెన్ చేయడం కీలక పరిణామం.

Nara Lokesh Andhra Pradesh Investments: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పెట్టుబడులపై కేవలం ఎంవోయూలు చేసుకోవడమే కాకుండా.. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పారిశ్రామికవేత్తలకు అప్డేట్స్ ఇస్తున్న విధానం చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి కొన్ని పెట్టుబడులు వెనక్కి వెళ్లాయనే విమర్శలు వినిపించగా.. ప్రస్తుతం కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదరడం ఈ ప్రయత్నాల్లో కీలక పరిణామంగా నిలిచింది.
ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ ప్లాంట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా.. వాటిని వేగంగా పట్టాలెక్కించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనే అంశానికి ఓర్వకల్లు రిలయన్స్ బెవరేజ్ ప్లాంట్ ఉదాహరణగా నిలుస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా క్యాంపా కోలా, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తులు దేశవిదేశాలకు సరఫరా కానున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు కేవలం 12 నెలల్లోనే ఉత్పత్తి దశకు చేరినట్లు మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. స్వదేశీ బ్రాండ్ క్యాంపా రాయలసీమ గడ్డపై మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతోందని వివరించారు.
రాయలసీమ యువతకు 1,200 ఉద్యోగాలు
ఓర్వకల్లు ప్లాంట్ ద్వారా స్థానికంగా 1,200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. లాజిస్టిక్స్, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించి.. స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న లక్ష్యానికి ఈ పరిశ్రమ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమలను తీసుకొస్తున్నామని లోకేశ్ పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో భారీ పెట్టుబడి పెట్టిన రిలయన్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నామంటూ.. శనివారం సాయంత్రం రిలయన్స్ ప్లాంట్ గురించి వీడియోను పోస్ట్ చేశారు మంత్రి లోకేశ్..
పెట్టుబడుల అమలుపై వారానికోసారి సమీక్ష.. లోకేశ్ ప్రత్యేక కార్యాచరణ
సాధారణంగా కంపెనీలు ప్రభుత్వాలతో ఎంవోయూలు కుదుర్చుకున్న తర్వాత తమ ప్రాజెక్టుల పురోగతి కోసం అధికారులను, ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తుంటాయి. అయితే లోకేశ్ నేతృత్వంలోని పరిశ్రమల శాఖ ప్రతి వారం పెట్టుబడుల పురోగతిపై అప్డేట్స్ అందిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం పెంచడంతో పాటు ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నాయనే చర్చ పొరుగు రాష్ట్రంలోనూ సాగుతున్న నేపథ్యంలో ఏపీ పారిశ్రామిక విధానాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో వేగవంతమైన నిర్ణయాలు, పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ కీలకంగా మారాయి.
లోకేశ్ మార్క్ పాలన.. ఏపీకి పెట్టుబడుల పరుగులు
ముఖ్యంగా 2026 నవంబర్‌లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 303 ఎంవోయూల ద్వారా సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలక పరిణామం. అయితే ఈ ఎంవోయూలన్నీ వాస్తవ పెట్టుబడులుగా మారాల్సి ఉంది. గతంలో వెనుకబడిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో లోకేశ్ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారుతోంది. పెట్టుబడుల ఆకర్షణ నుంచి పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన వరకు ఫలితాలు కనిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.



