ఏపీలో పంచాయతీ, పురపాలక ఎన్నికల పోలింగ్ షురూ
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అంతేకాకుండా పట్టణ సంస్థలలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా.. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది.రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అనంతరం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
3,240 పంచాయతీల్లో పోలింగ్.. 74.45 లక్షల మంది ఓటర్లు
ఏపీలోని 26 జిల్లాల పరిధిలో 3,240 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 709 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల కోసం మొత్తం 31,614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు.
నాలుగు కార్పొరేషన్లకు నేడు ఎన్నికలు
రాష్ట్రంలో మిగిలిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 257 కార్పొరేటర్ స్థానాలకు 911 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నాలుగు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 11.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 12 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ పోలింగ్
మిగిలిన 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా నేడు ఓటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో 19 చైర్‌పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 707 కౌన్సిలర్ స్థానాలకు 2,057 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ 19 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 13.53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 14 వేల మంది సిబ్బందిని నియమించారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఈ కార్పొరేషన్‌లో మేయర్ పదవి కోసం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కూటమి తరఫున పేరం ఏడుకొండలు, వైసీపీ తరఫున పున్నా నాయక్ బరిలో నిలిచారు.
కుటుంబంతో కలిసి ఓటేసిన సీఎం చంద్రబాబు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని ఎంపీయూపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



