పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్
Pawan Kalyan on Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో సీట్ల పంపకాలుండవు.. జనసైనికులు, వీర మహిళలు స్వేచ్ఛగా నామినేషన్లు వేయొచ్చు.. పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.

Pawan Kalyan on Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలవవచ్చని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ శ్రేణులను ఎవరూ అడ్డుకోవద్దని జనసేన నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామస్థాయిలో రాజకీయంగా చురుగ్గా ఉండాలనుకునే జనసేన శ్రేణులకు పార్టీ అధినేత నుంచి స్పష్టమైన దిశానిర్దేశం లభించడంతో నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
పార్టీలకు అతీతంగా గ్రామపంచాయతీ ఎన్నికలు
గ్రామపంచాయతీ ఎన్నికలు స్థానిక స్వపరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్వహించే ఎన్నికలు. ఇవి రాజకీయ పార్టీల గుర్తులు, అధికారిక అభ్యర్థుల ప్రకటనల కంటే స్థానిక సమస్యలు, అభివృద్ధి, ప్రజలతో అభ్యర్థులకు ఉన్న అనుబంధానికి ప్రాధాన్యతనిస్తాయి. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయగల నాయకత్వాన్ని ఎన్నుకోవడమే ఈ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారికి ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు ఉండకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తమ గ్రామాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని వెల్లడించారు.
— JanaSena Party (@JanaSenaParty) November 22, 2026
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భిన్నంగా..
గతంలో జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన పలు స్థానాల్లో జనసేన, బీజేపీ మద్దతు ప్రకటించగా, కూటమి ధర్మానికి అనుగుణంగా ఆయా పార్టీలు వ్యవహరించాయి. అయితే గ్రామపంచాయతీ ఎన్నికల విషయంలో మాత్రం జనసేన అధినేత భిన్నమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో స్థానాల పంపకాలు ఉండవని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులు ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాట్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదనే సంకేతాన్ని ఇచ్చారు.
జనసేన కీలక నేతల సూచనలతోనే ఈ నిర్ణయమా..?
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా పార్టీ గుర్తులపై కాకుండా అభ్యర్థులు వ్యక్తిగతంగా పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ ముఖ్య నాయకులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి గ్రామంలో పార్టీ బలం పెరగాలంటే స్థానిక నాయకులు ఎన్నికల బరిలో ఉండటం అవసరమనే అభిప్రాయం కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
గ్రామస్థాయిలో జనసేనను స్ట్రాంగ్ చేయడమే పవన్ వ్యూహమా..?
పవన్ కల్యాణ్ తాజా ప్రకటనతో గ్రామాల్లో జనసేన రాజకీయ కార్యకలాపాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న స్థానిక నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశాన్ని వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. మొత్తంగా పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ స్పష్టమైన ఆదేశాలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. గ్రామాల్లో పార్టీకి ఉన్న ప్రజాదరణను, స్థానిక నాయకుల బలాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఎన్నికలు ఒక వేదికగా మారనున్నాయి. ఇక రాబోయే పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, జనసైనికులు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేస్తారు..? గ్రామస్థాయిలో పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.
జనసేన అభ్యర్థులకు ప్రత్యేక హెల్ప్ డెస్క్
ఆంధ్రప్రదేశ్‌లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా, మూడో విడత ఎన్నికల్లో జనసేన నాయకులు, జనసైనికులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు.
జనసైనికుడి మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
మరోవైపు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్తపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ఆయన, సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావుకు సూచించారు.



