పవన్ కల్యాణ్ నివాసం వద్ద అభిమాని ఆత్మహత్యాయత్నం
Pawan Kalyan Fan Attempts Suicide: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర అభిమాని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన సుచిత్గా గుర్తించారు.

Pawan Kalyan Fan Attempts Suicide: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసం వద్ద ఓ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పవన్ కల్యాణ్‌ను కలవాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు చెందిన సుచిత్ అనే యువకుడు ఆయన నివాసం వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
పవన్‌ను కలవాలంటూ హల్చల్
పవన్ కల్యాణ్‌ను కలవాలని పట్టుబడుతూ సుచిత్ ఆయన నివాసం వద్ద హల్చల్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ భద్రతా విధుల్లో ఉన్న బాడీగార్డ్‌పై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తన చేతులు, ఛాతీపై పదునైన వస్తువుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్స అందించినట్లు సమాచారం.
కేసు నమోదు చేసిన పోలీసులు
మరోవైపు పవన్ కల్యాణ్ నివాసం వద్ద జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు సుచిత్ పవన్ కల్యాణ్‌ను కలవడానికి ఎందుకు వచ్చాడు? బాడీగార్డ్‌పై దాడికి యత్నించడానికి, తనకు తాను గాయాలు చేసుకోవడానికి గల కారణాలేంటి.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆర్థిక ఇబ్బందుల కారణంగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని సుచిత్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు.



