Andhra Pradesh Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకాకముందే రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో పట్టు సాధించేందుకు ఆశావహులు, అభ్యర్థులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల కంటే ముందుండేందుకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, ఇతర నగరాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం నివసిస్తున్న గ్రామీణ ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఓటు వేయడానికి సొంతూరికి రావాలంటూ ఫోన్లు చేస్తూ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఓటుకు రూ.2 వేలు.. ఏసీ బస్సుల్లో ప్రయాణం

ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు వినూత్నమైన, ఖరీదైన ఆఫర్లతో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు రూ.2 వేల నగదు ఇస్తామంటూ ఆశ చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓటర్లు తమ గ్రామాలకు వచ్చి ఓటు వేసేందుకు ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, రాకపోకల బాధ్యత తమదేనంటూ ఓటర్లను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతటితో ఆగకుండా.. తమకే ఓటు వేస్తే అదనపు తాయిళాలు కూడా అందిస్తామని కొందరు అభ్యర్థులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల పోరు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆర్థిక బలప్రదర్శనగా మారుతోందనే చర్చ సాగుతోంది.

హైదరాబాద్ ఓటర్లే టార్గెట్.. ప్రత్యేక ప్యాకేజీలు

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లిన గ్రామీణ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా మారుతున్నారు. వీరిలో చాలామంది ఓటు హక్కును మాత్రం సొంత గ్రామాల్లోనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరిని గ్రామాలకు రప్పించడం అభ్యర్థులకు సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఓటర్లకు ఫోన్లు చేసి మరీ సంప్రదించడం, గ్రామానికి రావాల్సిందిగా కోరడం, రవాణా సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరు అయితే ఓటర్ల సంఖ్యను బట్టి బస్సుల ఏర్పాటుపైనా లెక్కలు వేస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. దీంతో పల్లెల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థమవుతోంది.

గ్రామాల్లో పెరుగుతున్న రాజకీయ పోటీ

పంచాయతీ ఎన్నికలు సాధారణంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు, వ్యక్తిగత పరిచయాలు, సామాజిక సమీకరణాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈసారి నగదు పంపిణీ, రవాణా ఏర్పాట్లు, ఇతర ప్రలోభాల ఆరోపణలు ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇలాంటి ఆఫర్లపై ప్రత్యర్థి వర్గాలు కూడా నిఘా పెడుతున్నాయి. ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు..? ఎలాంటి హామీలు ఇస్తున్నారు..? ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలని చూస్తున్నారు…? అనే అంశాలపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

ప్రలోభాలకు గురైతే చర్యలు తప్పవు

మొత్తానికి ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలుకాకముందే గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటుకు రూ.2 వేలు, హైదరాబాద్ నుంచి సొంతూరికి ఏసీ బస్సులు, అదనపు తాయిళాలంటూ సాగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అభ్యర్థుల ఆఫర్లు ఏ స్థాయికి చేరతాయి..? ఓటర్లు ప్రలోభాలకు లొంగుతారా..? లేక అభివృద్ధి, పనితీరుకే పట్టం కడతారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో రాబోయే పంచాయతీ ఎన్నికలు ఏపీలో మరింత హీట్ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దిలా ఉంటే ఓటుకు నోటుపై అధికారులు సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. డబ్బులకు ఓట్లను అమ్ముకోవడం నేరమని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.