Konaseema gas leak: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లోఅవుట్ సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గ్రామ సమీపంలోని తాడివారిమెరక ప్రాంతంలో ఓఎన్‌జీసీ అధికారులు చేపట్టిన రీడ్రిల్లింగ్ పనుల సమయంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో సీఎన్‌జీ గ్యాస్ బయటకు లీకైంది. దీంతో కొద్దిసేపటికే పరిసర ప్రాంతాలన్నీ గ్యాస్ వాసనతో నిండిపోయాయి.

భారీ శబ్దాలతో పరుగులు తీసిన ప్రజలు

అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న గ్రామస్తులకు ఒక్కసారిగా గ్యాస్ వాసన తగలడంతో పాటు భారీ శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందో అర్థంకాక జనం ఆందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతపై అనుమానంతో ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ వాసన క్రమంగా నగరం గ్రామ పరిసర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు సైతం వ్యాపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. గతంలో జిల్లాలో చోటుచేసుకున్న గ్యాస్ ప్రమాదాలను గుర్తుచేసుకుంటూ స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

అప్రమత్తమైన ఓఎన్‌జీసీ అధికారులు

గ్యాస్ బ్లోఅవుట్ సమాచారం అందిన వెంటనే ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలస్యం చేయకుండా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్యాస్ లీకేజీని నిలువరించేందుకు తక్షణమే అత్యవసర చర్యలు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బావి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా అధికారులు సమీప గ్రామాలను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు అగ్నిప్రమాదం సంభవించే అవకాశాలను నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్ బావి వద్ద ఎలాంటి మంటలు చెలరేగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లోఅవుట్ ప్రాంతం చుట్టూ మంటలు వ్యాపించకుండా నిరోధించేందుకు వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా నీటిని వెదజల్లుతూ ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ పీడనం, లీకేజీ తీవ్రతను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి ముమ్మరంగా పనిచేస్తున్నారు. లీకేజీని పూర్తిగా అరికట్టి సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా అత్యవసర చర్యలు కొనసాగిస్తున్నారు.

ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

నగరం గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ప్రమాద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకవుతున్న ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఓఎన్‌జీసీ అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైన భద్రతా చర్యలు చేపట్టేలా ఓఎన్‌జీసీ ఛైర్మన్‌తో స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని, సహాయక చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రజల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రెండు వందల కుటుంబాలను తరలించిన అధికారులు

గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సందర్శించారు. ప్రమాద పరిస్థితులను పరిశీలించి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఓఎన్‌జీసీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా స్వయంగా ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. నాలుగు ఫైరింజన్లను రంగంలోకి దించి గ్యాస్ పీడనాన్ని తగ్గించేందుకు ఓఎన్‌జీసీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం మరింత విస్తరించకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

గతంలోనూ ఇదే జిల్లాలో గ్యాస్ లీకేజీ

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత అక్టోబర్ 26న ఇదే జిల్లాలోని అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోనూ గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. గ్రామంలోని వరి పొలాల మధ్య ఉన్న ఓఎన్‌జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ బయటకు లీకైంది. పైపులైన్ నుంచి పొగమంచును తలపించేలా గ్యాస్ పైకి ఎగసిపడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు నగరం గ్రామంలో మరోసారి భారీ స్థాయిలో గ్యాస్ బ్లోఅవుట్ చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. గ్యాస్ లీకేజీ పూర్తిగా నిలిచిపోయి పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయోనని ఎదురుచూస్తున్నారు.