Nara Lokesh Leadership: ఒకే ఒక్కడు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్. అటు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు.. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. రాజకీయ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు రెండింటినీ సమర్థంగా సమన్వయం చేసుకుంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. మూడు రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల సందడి కొనసాగింది. నేతలను సమన్వయం చేసుకోవడం, సీట్ల సర్దుబాటు, గెలుపు వ్యూహాలు.. ఇలా అన్నింటినీ మంత్రి నారా లోకేశ్ తన భుజస్కంధాలపై వేసుకుని ముందుండి నడిపించారు. పార్టీ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం వేదికగా సీఐఐ సదస్సును సమర్థంగా నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు రాష్ట్రాభివృద్ధి! ఈ రెండింటినీ సమతూకంతో ముందుకు తీసుకెళ్లడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ నారా లోకేశ్ మాత్రం తన పనితీరుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన చొరవ, పట్టుదల, నిరంతర శ్రమే ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక బలంగా మారుతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కేబినెట్ భేటీకి ముందే నివేదిక.. లోకేశ్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సుకు ముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులతో నారా లోకేశ్ ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో ఎదురైన ఓటములకు గల కారణాలు, నాయకుల మధ్య సమన్వయ లోపాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర నివేదికలను అందించారు. ఎన్నికల సమయంలో మంత్రి లోకేశ్ పెద్దగా కనిపించడం లేదని.. ఆయన ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని కొందరు భావించినా, తెరవెనుక ఆయన ఎంతటి సమాచారాన్ని సేకరించారో ఈ నివేదికలతో స్పష్టమైందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మారుమూల గ్రామాల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది..? ఎక్కడ సమన్వయ లోపం ఉంది..? ఏ నాయకుడు ఎక్కడ విఫలమయ్యారు..? వంటి అంశాలను గణాంకాలతో సహా వివరించడం మంత్రులను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలుస్తోంది. క్షేత్రస్థాయి రాజకీయాలపై ఇంతటి పట్టుండటం.. ప్రతి నియోజకవర్గం పరిస్థితిపై అవగాహన కలిగి ఉండటం లోకేశ్ ప్రత్యేకతగా పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. పైకి కనిపించకపోయినా.. తెరవెనుక పూర్తి సమాచారంతో పనిచేసే నాయకత్వం ఆయన సొంతమని చెబుతున్నారు. దీంతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో లోకేశ్ దృష్టిలో మంచి మార్కులు సాధించేందుకు ఇతర మంత్రులు, నేతలు ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోకేశ్ వ్యూహం.. ఏపీకి రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావాలంటే కేవలం ప్రభుత్వ ప్రకటనలు సరిపోవు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించాలి. వారికి రాష్ట్రంపై భరోసా కల్పించాలి. పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఏపీని ఒక బలమైన పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టాలి. ఈ దిశగా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు తరలివచ్చారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక మంత్రి లోకేశ్ మూడు నెలల నిరంతర శ్రమ ఉందని ఆయన సహచరులు చెబుతున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడటం.. ఏపీలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను వివరించడం.. ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహకాలను తెలియజేయడం.. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చూడండి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

స్పెషల్ అట్రాక్షన్‌గా మంత్రి నారా లోకేశ్‌

రెండు రోజుల సీఐఐ సదస్సులో నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీ ప్రభుత్వంతో సుమారు రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం వెనుక ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఏర్పడిన నమ్మకంతో పాటు.. మంత్రి లోకేశ్ చేసిన నిరంతర ప్రయత్నాలు కీలకంగా నిలిచాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజానికి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించడం ఒక ఎత్తయితే.. వారిని ఒప్పించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేయడం మరో ఎత్తు. ఈ రెండో పనిలోనే లోకేశ్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం చంద్రబాబు అనుభవం, విజన్‌కు తోడుగా లోకేశ్ దూకుడు, యువ నాయకత్వం, పారిశ్రామికవేత్తలతో నిరంతర సంప్రదింపులు ఏపీకి అదనపు బలంగా మారుతున్నాయని చెబుతున్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించే నాయకుడు ఉండాలి. వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఉండాలి. ఆ విషయంలో లోకేశ్ కీలక బాధ్యత తీసుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన చొరవ లేకపోతే అంతర్జాతీయ కంపెనీలను ఈ స్థాయిలో ఏపీ వైపు ఆకర్షించడం అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.

లోకేశ్ మార్క్.. అంతర్జాతీయ వేదికపై ఏపీ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాలకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేసే వేదికగానూ నిలిచింది. సదస్సుకు హాజరైన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను గిరిజనుల థింసా నృత్యం, విజయనగరం జిల్లాకు ప్రత్యేకమైన తప్పెటగుళ్ల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విదేశీ ప్రతినిధులు సైతం కళాకారులతో కలిసి అడుగులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియోలు, ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు వచ్చింది. అరకు కాఫీతో పాటు స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, కళలు, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల ఫొటోలను ప్రదర్శించడం కూడా సదస్సుకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కలిపి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన సదస్సులో కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెట్టుబడి దారులకు భరోసా.. పరిశ్రమల విషయంలో దూకుడు

ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే అక్కడి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టే నాయకత్వం ఉండాలి. పెట్టుబడిదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే నాయకుడు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బాధ్యతను నారా లోకేశ్ ముందుండి తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కేవలం పెట్టుబడుల సదస్సు నిర్వహించడంతోనే బాధ్యత పూర్తయిందని భావించకుండా.. కంపెనీలను ఏపీకి తీసుకురావడం, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడం వంటి లక్ష్యాలతో లోకేశ్ ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు అనుభవానికి లోకేశ్ యువ నాయకత్వం తోడైతే.. ఏపీ పారిశ్రామిక రంగం మరింత వేగంగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కంపెనీలతో నేరుగా మాట్లాడటం, పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించడం, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయడంలో లోకేశ్ పాత్ర కీలకమని పేర్కొంటున్నారు.