BJP Minister Srinivasa Varma Slams: ఏపీలో అధికార కూటమిగా కొనసాగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల కేటాయింపు వ్యవహారం కూటమిలో చిచ్చు పెట్టింది. తమ పార్టీకి కనీస గౌరవం ఇవ్వకుండా టీడీపీ, జనసేన నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిత్రపక్షాల తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

సీట్ల సర్దుబాటులో బీజేపీకి తీరని అన్యాయం.. ?

భీమవరం మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. పొత్తులో భాగంగా మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. ఇక వార్డుల పంపకంలో టీడీపీకి 24, బీజేపీకి కేవలం ఐదు స్థానాలు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అయితే సీట్ల కేటాయింపులో తమ పార్టీకి తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన స్థానాల్లో కూడా టీడీపీ, జనసేన నేతలు సూచించిన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇచ్చారనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి ఫైర్

ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కీలక నిర్ణయాలు కూడా సమష్టిగా తీసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. సీట్ల కేటాయింపులో టీడీపీ, జనసేన పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించాయని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతున్న బీజేపీ సీనియర్ నాయకులకు కనీస గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు పరస్పర అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ భీమవరంలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంపీ కుమారుడికి సీటు దక్కలేదు: శ్రీనివాసవర్మ

సీట్ల పంపకంలో బీజేపీ నేతలను ఏ విధంగా పక్కన పెట్టారో చెప్పడానికి రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కుమారుడి ఉదంతాన్ని మంత్రి ప్రస్తావించారు. ఆయన కుమారుడికి సైతం భీమవరం మున్సిపాలిటీలో వార్డు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల కుటుంబాలకు కూడా తగిన గుర్తింపు లభించకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందన్నది మంత్రి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు కూటమి ఐక్యత గురించి చెబుతూనే, మరోవైపు సీట్ల పంపకంలో తమను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. టీడీపీ, జనసేన మద్దతు లేకపోయినా, బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసినా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీగా గెలిచి.. కేంద్ర మంత్రిగా అయిన శ్రీనివాసవర్మ

సుధీర్ఘ కాలం పాటు ఆర్ఎస్ఎస్‌లో పని చేసిన శ్రీనివాసవర్మ గత సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస వర్మ విజయం సాధించారు. అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యత్వాన్ని పాకా సత్యనారాయణకు కేటాయించింది. అయినప్పటికీ భీమవరం మున్సిపల్ ఎన్నికల సీట్ల పంపకంలో బీజేపీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ సాధించిన ఆయన కూటమి ప్రభంజనంలో విజయం సాధించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేనకు చైర్మన్ పదవితో పాటు అత్యధిక వార్డులు దక్కేలా సీట్ల పంపకాలు జరగడం బీజేపీ అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మొత్తానికి భీమవరం మున్సిపల్ ఎన్నికలు కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతున్నాయి. బయటకు మూడు పార్టీలు ఒక్కటేనని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సీట్ల లెక్కలు, రాజకీయ ప్రాధాన్యాలు విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలతో భీమవరంలో కూటమిలో కుంపట్లు రాజుకున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.