Hyderabad Biryani Price Hike: హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఘుమఘుమలాడే మసాలాలు, నాణ్యమైన బియ్యం, రుచికరమైన చికెన్‌తో తయారయ్యే ఈ వంటకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలో ఉండే వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు సైతం హైదరాబాద్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వేడి వేడి బిర్యానీతో విందు చేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే ఇప్పుడు బిర్యానీ ప్రియులకు చేదు వార్త ఎదురైంది. హైదరాబాద్‌లో బిర్యానీ ధరలు పెరుగుతున్నాయి.

ప్లేట్ బిర్యానీపై రూ. 50 వరకు పెంపు

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లతో పాటు చిన్న హోటళ్లు కూడా బిర్యానీ ధరలను పెంచుతున్నాయి. పెరిగిన ముడిసరుకుల ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా గతంలో ఉన్న ధరలకే బిర్యానీ విక్రయించడం కష్టంగా మారిందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు ఒక్కో ప్లేట్ బిర్యానీపై రూ. 50 వరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ధరల పెంపు రూ. 30 వరకు ఉంది. దీంతో వీకెండ్స్‌లో బిర్యానీ తినాలన్నా, చిన్నపాటి వేడుకలు జరుపుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ పెంపు మరింత భారంగా మారనుంది.

నెలకు రూ. 1,000 వరకు అదనపు ఖర్చు

హైదరాబాద్ నగరంలో సుమారు 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఉద్యోగాలు, చదువుల కోసం నగరంలో నివసించే బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల సంఖ్య సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరిలో చాలామంది ప్రతిరోజూ హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తెప్పించుకుంటుంటారు. ముఖ్యంగా బిర్యానీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరల పెంపు కారణంగా బిర్యానీని తరచుగా తినేవారిపై నెలకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 10 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో ప్లేట్‌పై సగటున రూ. 30 పెరిగితే నగరవాసులపై రోజుకు రూ. 1.8 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే నెలకు లెక్కిస్తే ఈ మొత్తం రూ. 54 కోట్లకు చేరుతుంది. ఇక ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసేవారికి డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు అదనంగా కలుస్తుండటంతో బిల్లు మరింత పెరుగుతోంది.

ముడిసరుకుల ధరల పెరుగుదలే ప్రధాన కారణం

గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా బిర్యానీ తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. బిర్యానీలో కీలకమైన నెయ్యి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ. 580 నుంచి రూ. 800 దాటింది. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా సుమారు 20 శాతం పెరిగాయి. వంట నూనె లీటరు ధర రూ. 150కి చేరగా, నాణ్యమైన బియ్యం కిలో ధర రూ. 100కు చేరువైంది. చికెన్, కూరగాయల ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. దీంతో బిర్యానీ తయారీకి అయ్యే ఖర్చు గణనీయంగా పెరిగింది.

గ్యాస్ ధరల పెరుగుదలతో మరింత భారం

ముడిసరుకుల ధరలతో పాటు హోటళ్ల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. గతంలో రూ. 1,750గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3,080కి చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. వంట కోసం గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ పెరుగుదల రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు ముడిసరుకులు, మరోవైపు గ్యాస్, ఇతర నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాత ధరలకే బిర్యానీ విక్రయించడం సాధ్యం కావడం లేదని హోటళ్ల యాజమాన్యాలు అంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వస్తోందని వివరిస్తున్నాయి. హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం పెరిగిన ఖర్చుల కారణంగానే ధరల సవరణ జరుగుతోందని చెబుతున్నారు.

మొత్తంగా ఒకప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు క్రమంగా ఖరీదైన వంటకంగా మారుతోంది. ఈ ధరల పెంపు బిర్యానీ ప్రియుల నెలవారీ బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.