Hyderabad Restaurant Raids: హైదరాబాద్‌లో బిర్యానీ అంటే కేవలం ఫుడ్‌ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. చికెన్ బిర్యానీలో మసాలా ఘాటు, మటన్ కీమా బాల్స్‌లో ఆ రుచి, వేడివేడి కబాబుల్లో ఆ కమ్మదనం.. ఇలా ఒక్కో వంటకం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటాం. అంతే కాదు చికెన్ బిర్యానీపై నెయ్యి వాసన వస్తుందా..? మటన్ కీమా బాల్స్ మెత్తగా ఉన్నాయా..? మసాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందా..? అని ఆలోచిస్తాం. కానీ మీరు ఎంతో ఇష్టంగా తినే ప్రముఖ రెస్టారెంట్ల వంటకాల వెనుక ఎంత అపరిశుభ్రత దాగి ఉందో తెలిస్తే నిజంగానే నోరెళ్లబెట్టాల్సిందే. బయట నుంచి చూస్తే గ్లాసీ ఇంటీరియర్స్, అందంగా ముస్తాబైన సర్వర్లు, రిచ్ అంబియెన్స్.. కానీ వంటగదిలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నది అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిశీలనలో కొందరు రెస్టారెంట్లలో వంటలు తయారు చేసే సిబ్బంది కనీస పరిశుభ్రతను కూడా పాటించడం లేదనే ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తలకు క్యాప్‌లు, చేతులకు గ్లౌజులు, శుభ్రమైన దుస్తులు ధరించి వంట చేయాల్సిన చోట.. కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఒకడు గుట్కా వేసుకొని చికెన్ బిర్యానీ వండుతుంటే.. మరొకడు చిన్న చెడ్డీ వేసుకొని రుమాలీ రోటీలు చేస్తున్నాడు. పైగా స్పెషల్‌గా అతని చెమట వేసిన కడాయి కూరను మన లొట్టలు వేసుకొని తింటున్నట్లు టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు.

గుట్కా తింటూ బిర్యానీ చేస్తున్న వంటమాస్టర్..!

హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో నోరూరించే రుచుల వెనుక ఎంతటి అపరిశుభ్రత దాగి ఉందో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలు చూస్తే అర్థమవుతుంది. నగరంలోని ప్రముఖ హోటళ్లలోనే కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వినియోగించడం వంటి విషయాలు బయటపడటం కలకలం రేపుతోంది. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్ల కిచెన్లు, డైనింగ్ ఏరియాల్లో కనీస శుభ్రత కూడా కనిపించలేదని అధికారులు గుర్తించారు. వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణం, పరిశుభ్రత పాటించకుండా వంటలు చేయడం, గుట్కా, పాన్ మసాలాలు నములుతూ ఆహారం తయారు చేస్తున్న సిబ్బంది తీరు అధికారులను విస్మయానికి గురిచేసింది. తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో చెడిపోయిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహారం, గడువు ముగిసిన పదార్థాలను అధికారులు గుర్తించారు. మొత్తం 544 కిలోల నాసిరకం, చెడిపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని టీజీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు.

14 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్..

ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 14 హోటళ్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

షోకాజ్ నోటీసులు అందుకున్న హోటళ్లు

1. తాజ్ ఫలక్‌నుమా (ఇంజన్ బౌలి)
2. హోటల్ సబ్లీ (చార్మినార్)
3. పిస్తా హౌస్ రెస్టారెంట్ (ఫలక్‌నుమా)
4. స్వీకార్ హోటల్ (సంతోష్‌నగర్)
5. మండి ఎట్ 36 అరేబియన్ కిచెన్ (చార్మినార్)
6. గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్ (మాసబ్‌ట్యాంక్)
7. ఇంపీరియల్ మల్టీక్యుసిన్ రెస్టారెంట్ (టోలిచౌకి)
8. టైజా బేకరీ (లక్ష్మీకాపుల్)

లైసెన్సులు సస్పెండ్ అయిన హోటళ్లు

1. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ (టోలిచౌకి)
2. లక్ష్మీ రెస్టారెంట్ (సంతోష్‌నగర్)
3. షాగోస్ కేఫ్ (శాలిబండ)
4.హోటల్ నాయాబ్ (నాయాఫుల్)
5. శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా (గుడిమల్కాపూర్)
6. సిద్ధిఖీ కబాబ్ సెంట్రల్ కిచెన్ (గుడిమల్కాపూర్)
7. అల్ సబా హోటల్ (టోలిచౌకి)
8. మెహాఫిల్ రెస్టారెంట్ (దిల్‌సుఖ్‌నగర్)
9. హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ (సంతోష్‌నగర్)
10. డైన్‌హిల్ రెస్టారెంట్ (మాసబ్‌ట్యాంక్)
11. సోషల్ రెస్టారెంట్ (మలక్‌పేట)
12. హోటల్ అక్షయ టిఫిన్స్ (మలక్‌పేట)
13. హోటల్ వెంకటేశ్వర (ఎంజే రోడ్డు)
14. ఈజిప్ట్ ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ (రేతిబోలి)

రుచి కోసం వెళ్తే.. ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామా?

హోటల్ బయట ఆకర్షణీయమైన బోర్డులు, లోపల నోరూరించే వంటకాలు చూసి ఆహారం ఆర్డర్ చేస్తున్న వినియోగదారులకు వంటగదుల్లోని వాస్తవ పరిస్థితులు తెలియవు. మనం ఎంతో ఇష్టంగా తింటున్న ఆహారం తయారయ్యే చోటే కనీస పరిశుభ్రత లేకపోతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరున్న హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే, సామాన్యులు బయట ఆహారం తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రముఖ హోటళ్లలో ఫుడ్ టేస్టీగా ఉందని మాట్లాడుకునే ప్రజలు, వాటిని తయారు చేసిన చేతులు శుభ్రంగా ఉన్నాయా..? వంటగదిలో ఈగలు, బొద్దింకలు ఉన్నాయా..? ఆహార పదార్థాలను సరైన టెంపరేచర్‌లో నిల్వ చేస్తున్నారా..? అనే విషయాలను పట్టించుకోరు. కానీ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. సో వీకెండ్ అని లగెత్తుకుంటూ వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచన చేయండి.