Hyderabad food safety inspections: హైదరాబాద్‌లో బిర్యానీ అంటే ఇష్టమా.. వీకెండ్ వచ్చిందంటే రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేయడం లేదా స్విగ్గీ, జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అలవాటా.. అయితే ఒక్కసారి ఆగండి. మీరు ఆర్డర్ చేస్తున్న ఆహారం ఎక్కడ తయారవుతోంది. అక్కడ పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. దీంతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలకు దిగారు.

నాలుగు రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్‌లో వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాలుగు రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ జాబితాలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మాదాపూర్ బావర్చి, కూకట్‌పల్లిలోని ది స్పైస్ కిచెన్, టోలిచౌకిలోని మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్, చందానగర్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్ ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వంటగదుల్లో బొద్దింకలు.. ఎలుకల వ్యర్థాలు

ఈ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వంటగదుల్లో బొద్దింకలు సంచరిస్తుండటంతో పాటు ఎలుకల విసర్జితాలు కూడా కనిపించాయి. ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానంలోనూ తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. ఫ్రిడ్జ్‌లలో వెజ్, నాన్‌-వెజ్ పదార్థాలను నిబంధనలకు విరుద్ధంగా కలిపి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నాసిరకం సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించడం, కిచెన్ నేలలు దెబ్బతినడం, గోడలు పొగతో నిండిపోవడం వంటి అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. అంతేకాకుండా ఆహారాన్ని తయారుచేసే సిబ్బందికి అవసరమైన వైద్య పరీక్షల ధ్రువపత్రాలు కూడా లేవని తనిఖీల్లో తేలింది. టోలిచౌకిలోని అల్ కరీమ్ బేకర్స్, గౌళిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్‌ను మూసివేయించారు. అవసరమైన అనుమతులు లేకుండా ఆహార సంబంధిత వ్యాపారాలు నిర్వహించడంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.

135 కిలోల నాణ్యతలేని ఆహార పదార్థాలు స్వాధీనం

తనిఖీల సందర్భంగా కల్తీ జరిగినట్లు అనుమానం ఉన్న ఎనిమిది ఆహార నమూనాలను అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. దాదాపు 135 కిలోల నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా రాజు గారి బిర్యానీ, స్వాద్ స్పైసీ రెస్టారెంట్లకు త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. మెహఫిల్ రెస్టారెంట్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. త్వరలోనే మరోసారి తనిఖీలు నిర్వహించనున్నారు. లైసెన్సులు సస్పెండ్ అయిన నాలుగు రెస్టారెంట్ల విషయంలో ఫుడ్ డెలివరీ సంస్థలకు కూడా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఆయా రెస్టారెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు స్పష్టం చేశారు. దీంతో ఈ రెస్టారెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలను ఆర్డర్ చేసే అవకాశం కూడా నిలిచిపోనుంది.

బిర్యానీ తినే ముందు.. ఆర్డర్ పెట్టే ముందు జాగ్రత్త

హైదరాబాద్‌లో రుచికరమైన బిర్యానీ కోసం రెస్టారెంట్లకు వెళ్లే వారు, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారు ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోతే వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై కఠిన చర్యలు కొనసాగనున్నాయి.