Alcohol Effects on Brain: ఫ్రెండ్స్ కలిస్తే పార్టీ.. మానసిక ఒత్తిడి పెరిగితే ఆల్కహాల్ తాగాల్సిందే. పండుగలకు, పబ్బాలకు, ఇలా ఫంక్షన్లకు కార్యం ఏదైనా.. కార్యక్రమం ఎక్కడైనా సరే యూత్‌కు వెంటనే గుర్తుకు వచ్చేది ఆల్కహాల్ కేరాఫ్ మందు. రోజంతా ఎదురైన ఒత్తిడిని మరిచిపోవడానికి రాత్రి మందు తాగడం, వారాంతాల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే ఇలా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యువ వయస్సులో మద్యం సేవించడం భవిష్యత్తులో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు విపరీతంగా మద్యం తాగి, ఆ తర్వాత పూర్తిగా మానేసినప్పటికీ మెదడులో ఏర్పడిన కొన్ని మార్పులు కొనసాగవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఒత్తిడికి మందుగా మద్యం.. భవిష్యత్తులో మెదడుకు ముప్పు

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అంహెర్స్ట్ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధన వివరాలు ఆల్కహాల్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. యువ దశలో ఉన్న ఎలుకలకు అధిక మోతాదులో మద్యం అందించడంతో పాటు దీర్ఘకాలిక ఒత్తిడికి గురిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వాటికి మద్యం పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ మధ్య వయస్సుకు సమానమైన దశకు చేరుకున్న తర్వాత వాటి మెదడు పనితీరులో సమస్యలు కనిపించాయి. ముఖ్యంగా కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి అనుగుణంగా ఆలోచించడం, తమ ప్రవర్తనను మార్చుకోవడం, సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొనడం వంటి సామర్థ్యాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. దీనినే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. అంటే ఒకప్పుడు యువ వయస్సులో ఒత్తిడిని మరిచిపోవడానికి మద్యం సేవించిన ప్రభావం, తర్వాత మద్యం మానేసినప్పటికీ మెదడు పనితీరులో కనిపించవచ్చన్నది ఈ పరిశోధనలోని ముఖ్యమైన అంశం.

మెదడులోని కీలక భాగంపైనే ప్రభావం

ఈ మార్పులకు మెదడులోని లోకస్ కోరూలియస్ అనే కీలక భాగంలో చోటుచేసుకున్న మార్పులు ప్రధాన కారణంగా పరిశోధకులు గుర్తించారు. లోకస్ కోరూలియస్ మెదడులో ఒత్తిడికి సంబంధించిన ప్రతిస్పందనలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రమాదం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడుతుంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ తిరిగి ప్రశాంత స్థితికి చేరుకోవాలి. అయితే యువ దశలో అధిక మద్యం, దీర్ఘకాలిక ఒత్తిడి కలిసినప్పుడు ఈ వ్యవస్థ పనితీరులో మార్పులు వస్తున్నట్లు అధ్యయనం సూచించింది. ఈ పరిశోధనలో మరో ముఖ్యమైన అంశం ఆక్సిడేటివ్ స్ట్రెస్. శరీరంలోని కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగినప్పుడు కణాలకు నష్టం కలిగే అవకాశం ఉందని గుర్తించారు.

మద్యం మానేసినా పాత ప్రభావాలు వెంటాడుతాయా…?

ఈ అధ్యయనం వెల్లడించిన అత్యంత ఆందోళనకరమైన అంశం ఇదే. మద్యం సేవించడం మానేస్తే ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే గతంలో మద్యం, ఒత్తిడి కలయిక కారణంగా మెదడులో ఏర్పడిన అన్ని మార్పులు వెంటనే తిరిగి సాధారణ స్థితికి వస్తాయని చెప్పలేమని ఈ పరిశోధన సూచిస్తోంది. చాలామంది మద్యం సేవించడానికి పెద్ద కారణాలు ఉండవు. కొందరు స్నేహితుల కోసం తాగుతారు. మరికొందరు పని ఒత్తిడిని మరిచిపోవడానికి తాగుతారు. ఇంకొందరు రోజూ కొద్దిగా తాగితే ఎలాంటి సమస్య ఉండదని భావిస్తారు. కానీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి మద్యాన్ని అలవాటుగా మార్చుకోవడం ప్రమాదకరం. ముఖ్యంగా యువ వయస్సులో అధికంగా మద్యం సేవించడం, దీర్ఘకాలిక ఒత్తిడికి గురికావడం భవిష్యత్తులో మెదడు పనితీరుపై ప్రభావం చూపవచ్చని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

ఒత్తిడి తగ్గించడానికి మద్యం ముఖ్యం కాదు: శాస్త్రవేత్తలు

ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం మీద ఆధారపడటం కంటే వ్యాయామం, తగినంత నిద్ర, ధ్యానం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా మద్యం సేవించకుండా ఉండటమే ఆరోగ్యానికి సురక్షితమైన ఎంపిక. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవడం లేదా మానేయడం కోసం వైద్యుల సహాయం తీసుకోవాలి. ఎక్కువగా, క్రమం తప్పకుండా మద్యం సేవించే వారు ఒక్కసారిగా మానేయడం వల్ల కూడా తీవ్రమైన విత్‌డ్రాయల్ లక్షణాలు రావచ్చు కాబట్టి వైద్య పర్యవేక్షణ అవసరం. క్షణికమైన ఒత్తిడి ఉపశమనం కోసం మద్యం సేవించడం వల్ల భవిష్యత్తులో మీ మెదడు ఆరోగ్యమే ప్రమాదంలో పడకూడదు. ఈరోజు సరదాగా అనిపించే అలవాటు రేపు మీ ఆలోచనా సామర్థ్యాన్ని, నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రభావితం చేసే అవకాశం ఉందని తాజా పరిశోధన గుర్తుచేస్తోంది. అందుకే ఒత్తిడికి మద్యం పరిష్కారం కాదని ఇప్పటికైనా గుర్తించాలి.