Heart attack risk in the morning: గుండెపోటు.. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరికీ వస్తుందో ముందుగా చెప్పడం అంత సులభం కాదు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా, పగలైనా, రాత్రైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలకు గురైన సందర్భాల్లోనూ గుండెపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. గుండెపోటుకు నిర్దిష్టమైన సమయం అంటూ లేకపోయినప్పటికీ, చాలామందిలో తెల్లవారుజామున, ముఖ్యంగా ఉదయం వేళల్లో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాత్రి 11 గంటలతో పోలిస్తే ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంటున్నారు.

ఉదయం వేళల్లోనే ఎందుకంత ముప్పు..?

అసలు ఉదయం వేళల్లోనే గుండెపోటు ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది. దీనికి మన శరీరంలో సహజంగా జరిగే మార్పులే ప్రధాన కారణమని నిపుణులు వివరిస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఈ సమయంలో గుండె వేగం, రక్తపోటు సాధారణంగా తగ్గుముఖం పడతాయి. శరీరంలోని వివిధ వ్యవస్థలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అయితే, ఉదయం నిద్ర నుంచి మేల్కొనే సమయం దగ్గరపడుతున్న కొద్దీ శరీరం తిరిగి రోజువారీ కార్యకలాపాలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయులు ఉదయం వేళల్లో పెరుగుతుంటాయి. ఇవి శరీరాన్ని చురుగ్గా, అప్రమత్తంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే, ఈ హార్మోన్ల ప్రభావంతో గుండె కొట్టుకునే వేగం పెరగడంతో పాటు రక్తపోటు కూడా అధికమవుతుంది. ఫలితంగా గుండె రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు పంపించేందుకు మరింత శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై, రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై అదనపు భారం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్త..!

ఇప్పటికే హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళల్లో రక్తపోటు, గుండె వేగంలో వచ్చే మార్పులు వారి గుండెపై ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి పూడికలు ఏర్పడినవారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. రక్తనాళాల్లో ఇప్పటికే పేరుకుపోయిన పూడికలు ఉదయం వేళల్లో చిట్లిపోయే పరిస్థితి ఏర్పడితే ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు రక్తప్రసరణకు ఆటంకం కలిగి గుండెకు అవసరమైన రక్తం సరిగా అందకపోవచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉదయం సమయాన్ని తేలికగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

ఉదయం వేళల్లో అప్రమత్తత అవసరం..

మొత్తంగా చూస్తే, గుండెపోటు ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే, శరీరంలో సహజంగా జరిగే హార్మోన్ల మార్పులు, గుండె వేగం, రక్తపోటులో వచ్చే పెరుగుదల కారణంగా ఉదయం వేళల్లో కొందరికి ముప్పు అధికంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.