Young Age Stroke: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా పక్షవాతం కేవలం వృద్ధులకే పరిమితం కావడం లేదు. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనూ పక్షవాతం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన ఈ వ్యాధి ఇప్పుడు యువతను సైతం వేధిస్తోంది. యువతలో పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, గుండె జబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయులు కలిసి ఉన్నప్పుడు పక్షవాతం వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. మధుమేహం కాలక్రమేణా రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, ఇతర జీవక్రియ సంబంధిత సమస్యలతో ముడిపడి ఉంటుంది.

పక్షవాతం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

యువతలో పక్షవాతం వచ్చినప్పుడు దాని పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. అందువల్ల లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. తల తిరగడం, నడవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం లేదా శరీరంపై నియంత్రణ కోల్పోవడం వంటి ఆకస్మిక లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే చూపులో ఆకస్మిక మార్పులు రావడం, ఒక కంటిలో చూపు కోల్పోవడం లేదా పాక్షికంగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో ఒకవైపు తిమ్మిరి రావడం లేదా మరోవైపు కంటే తక్కువగా స్పర్శను గుర్తించడం వంటి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఈ రెండు స్ట్రోక్‌లు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి

శరీరానికి రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు మెదడు కణాలు నిమిషాల వ్యవధిలోనే దెబ్బతినడం ప్రారంభిస్తాయి. దీనివల్ల శరీరంలోని వివిధ విధులపై ప్రభావం పడుతుంది. పక్షవాతంలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. అందులో ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ వచ్చిన వెంటనే రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం మూసుకుపోతుంది. రెండోది హేమరేజిక్ స్ట్రోక్. ఇది వచ్చినప్పుడు రక్తనాళం చిట్లిపోవడం వల్ల మెదడులో రక్తస్రావం జరుగుతుంది. దీంతో వెంటనే పక్షవాతం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండు పరిస్థితులూ ప్రమాదకరమైనవే. వీటికి తక్షణ వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.

మొదటి నాలుగున్నర గంటలు అత్యంత కీలకం

పక్షవాతం లక్షణాలు మొదలైన తర్వాత చికిత్సలో జరిగే ప్రతి నిమిషం ఆలస్యం మెదడులోని లక్షలాది కణాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తొలి నాలుగున్నర గంటలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో అర్హులైన రోగులకు రక్తం గడ్డలను కరిగించే మందులు అందించవచ్చు. దీనివల్ల రోగి కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే సమయం వృథా చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అత్యవసర పరిస్థితులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం అవసరం.

లైఫ్‌స్టైల్‌తో పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చు

పక్షవాతం ముప్పును తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం ముఖ్యమైన చర్యలు. అలాగే మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, దానితో సంబంధం ఉన్న అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు సరైన చికిత్స తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. యువతలో పెరుగుతున్న పక్షవాతం ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాధి తొలి లక్షణాలను గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. పక్షవాతం విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని గుర్తుంచుకోవాలి.