Health Checkups After 50: బయటకు ఆరోగ్యంగా కనిపిస్తున్నంత మాత్రాన శరీరంలో ఎలాంటి సమస్యలు లేవని అనుకోవద్దు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, కిడ్నీ సమస్యలు చాలాసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే మెల్లగా పెరుగుతుంటాయి. చివరకు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేయొద్దు..

చాలామంది 50 ఏళ్లు దాటినా తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని భావిస్తుంటారు. రోజువారీ పనులు చేసుకుంటూ, ఎప్పటిలాగే జీవితం సాగుతుండటంతో వైద్య పరీక్షల అవసరాన్ని గుర్తించరు. మరికొందరు మద్యం సేవించడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నప్పటికీ తమ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అనుకుంటారు. అయితే శరీరంలో ఇప్పటికే వ్యాధులు ప్రారంభమై ఉండొచ్చు. వాటిని గుర్తించకుండా వదిలేస్తే ఒక దశలో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. రక్తనాళాల పనితీరు, ఎముకల బలం, కండరాల సామర్థ్యం, కంటి చూపు, వినికిడి వంటి అంశాలు ప్రభావితమవుతాయి. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు చూపకపోవచ్చు. అందువల్ల 50 ఏళ్లు దాటినవారు కనీసం ఏడాదికోసారి వైద్యులను సంప్రదించి, తమ ఆరోగ్య పరిస్థితికి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి

భారత్‌లో జీవనశైలి సంబంధిత వ్యాధుల భారం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం దేశంలో బీపీ 35.5 శాతం మందిలో, మధుమేహం 11.4 శాతం మందిలో, సాధారణ ఊబకాయం 28.6 శాతం మందిలో నమోదైంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమస్యలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమయ్యే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన తర్వాత వయసు, లింగం, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత అలవాట్ల ఆధారంగా కొన్ని క్యాన్సర్ల స్క్రీనింగ్ అవసరం కావచ్చు. ముఖ్యంగా పొగాకు వినియోగించే వారిలో నోటి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళలు వైద్యుల సూచన మేరకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలపై దృష్టి పెట్టాలి. కొ

ఎముకలు, కళ్ల ఆరోగ్యాన్ని విస్మరించొద్దు

వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళలు, తక్కువ బరువు ఉన్నవారు, గతంలో ఎముకలు విరిగినవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడేవారు అప్రమత్తంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఎముకల సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. అదేవిధంగా 50 ఏళ్ల తర్వాత కంటి శుక్లాలు, డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి వెనుక భాగంలోని రెటీనాను పరీక్షించుకోవాలి. ఆరోగ్య సమస్యలకు వయసుతో పాటు జీవనశైలి కూడా ప్రధాన కారణమవుతుంది. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు వినియోగం, మద్యపానం, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రలేమి, కుటుంబంలో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ చరిత్ర కూడా ప్రమాదాన్ని పెంచవచ్చు.అందుకే సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ తగినంత వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం ముఖ్యం.

అనారోగ్యం బయటపడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, వ్యాధి ముదరకముందే గుర్తించడం ఎంతో మేలు. అందుకే 50 ఏళ్లు దాటినవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి