Diabetes Prevention Tips: ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే డయాబెటిస్‌.. ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు పెరుగుతోంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత నియంత్రణ కోసం ఇబ్బందులు పడటం కంటే.. ముందుగానే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్నా.. కొన్ని జీవనశైలి మార్పులతో వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

బరువును అదుపులో ఉంచుకోవాలి

టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పును తగ్గించుకోవాలంటే ముందుగా బరువుపై దృష్టి పెట్టాలి. సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రస్తుత బరువులో 5 నుంచి 7 శాతం తగ్గించుకున్నా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం అవసరం. ఎందుకంటే పొట్ట కొవ్వు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. రోజువారీ ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పప్పులు, ఆకుకూరలు, గింజలు, చిరుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు తీసుకోవడం మంచిది. కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.

డైలీ ఎక్సర్‌సైజ్ తప్పనిసరి

ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా డయాబెటిస్‌ ముప్పును పెంచుతాయి. అందుకే వారానికి కనీసం 150 నిమిషాల పాటు నడక, సైక్లింగ్‌ వంటి మోస్తరు వ్యాయామాలు చేయాలి. వీటితోపాటు వారానికి రెండుసార్లు వెయిట్‌ ట్రైనింగ్‌ లేదా బాడీవెయిట్‌ వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల కండరాల పనితీరు, ఇన్సులిన్‌ సెన్సిటివిటీ మెరుగుపడతాయి. ధూమపానం ఆరోగ్యానికి హానికరమే కాకుండా ఇన్సులిన్‌ పనితీరుపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను పెంచి టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పును అధికం చేస్తుంది. అందుకే ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

టెస్టులు చేయించుకోవడం ముఖ్యం

డయాబెటిస్‌ వచ్చిన తర్వాతే పరీక్షలు చేయించుకోవడం కాకుండా ముందుగానే రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవాలి. ముఖ్యంగా 35 ఏళ్లు దాటినవారు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో డయాబెటిస్‌ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌, HbA1c పరీక్షల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ప్రీ-డయాబెటిస్‌ దశలోనే గుర్తిస్తే జీవనశైలిలో మార్పులతో డయాబెటిస్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న మార్పులను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పును తగ్గించుకోవడంతోపాటు వ్యాధి ప్రారంభాన్ని కూడా ఆలస్యం చేయవచ్చు.