ప్రాణాల మీదకు తెస్తున్న వైరల్ డైట్ ట్రెండ్స్
Dangerous Weight Loss Diets: వెయిట్లాస్పై ఈ మధ్య కాలంలో ఇష్టానుసారంగా వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ డైట్లు పాటిస్తే ప్రాణాల మీదకు వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dangerous Weight Loss Diets: “మా డైట్ పాటిస్తే నెలలోనే 20 కిలోల బరువు తగ్గుతారు.. వంద రోజుల్లో 50 కిలోల బరువు తగ్గడం గ్యారంటీ..” అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఉదయం తాము చెప్పిన కషాయం తాగాలని, మధ్యాహ్నం కేవలం పండ్లు మాత్రమే తినాలని, రాత్రికి కడుపు ఖాళీగా ఉంచాలని సూచిస్తున్నారు. మరికొందరు కీటో, లిక్విడ్, డీటాక్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటూ రకరకాల డైట్ ప్లాన్లను ప్రమోట్ చేస్తున్నారు. త్వరగా బరువు తగ్గాలనే ఆత్రంతో చాలామంది వీటిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. అయితే ఈ వైరల్ డైట్ ట్రెండ్స్ నిజంగా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయా..? లేక ప్రాణాల మీదకు తెస్తున్నాయా..?
సోషల్ మీడియానే డైట్ గైడ్.. వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం..!
ఒకప్పుడు బరువు తగ్గాలంటే వైద్యులు లేదా అర్హత కలిగిన డైటీషియన్ల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కనిపించే వీడియోలే చాలామందికి డైట్ గైడ్లుగా మారుతున్నాయి. ఏడు రోజుల్లో ఏడు కిలోలు తగ్గండి.. పది రోజుల్లో పొట్ట కరిగిపోతుంది.. ఒక్క డ్రింక్‌తోనే శరీరంలోని కొవ్వు మాయమవుతుంది.. అంటూ ఆకర్షణీయమైన ప్రచారాలు చేస్తున్నారు. వీటికి లక్షల్లో వ్యూస్ రావడంతో చాలామంది నిజమని నమ్ముతున్నారు. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా చేసే ఇలాంటి ప్రయోగాలు బరువు తగ్గించడం కంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదమే ఎక్కువ. ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉన్న కీటో డైట్, లిక్విడ్ డైట్, డీటాక్స్ డైట్, క్రాష్ డైట్, రోజుకు ఒక్కపూట మాత్రమే తినే విధానాలు అందరికీ ఒకేలా పనిచేయవు. వ్యక్తుల వయసు, ఆరోగ్య పరిస్థితి, హార్మోన్లు, జీవనశైలిని బట్టి ఆహార అవసరాలు మారుతుంటాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకరికి ప్రయోజనం కలిగించే డైట్ మరొకరికి ప్రమాదకరంగా మారవచ్చు. కొన్ని డైట్లలో కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గిస్తే, మరికొన్నింటిలో రోజంతా జ్యూసులు, నీళ్లతోనే సరిపెట్టుకోవాలని సూచిస్తారు. ఇంకొన్ని డైట్లలో రోజుల తరబడి ఆహారం తీసుకోకుండా ఉండాలని చెబుతారు. ఇలాంటి పద్ధతుల వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
బరువు తగ్గుతున్నారా.. శరీరంలోని బలాన్ని కోల్పోతున్నారా..
కఠినమైన డైట్లు మొదలుపెట్టినప్పుడు తొలుత బరువు తగ్గినట్లు కనిపించవచ్చు. అయితే ఆ తగ్గుదల శరీరంలోని కొవ్వు తగ్గడం వల్లే కాకుండా నీరు, కండరాల పరిమాణం తగ్గడం వల్ల కూడా కావచ్చు. ఫలితంగా అలసట, తల తిరగడం, రక్తపోటు పడిపోవడం, రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం, గుండె వేగంలో అసాధారణ మార్పులు వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు వైద్యుల సలహా లేకుండా ఇలాంటి డైట్లు పాటించడం ప్రమాదకరం. ఇప్పటికే మందులు వాడుతున్నవారు ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు చేసుకున్నా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అతిగా ఉపవాసం చేస్తే.. ఆస్పత్రికి వెళ్లాల్సిందేనా..?
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి డైట్ శాస్త్రీయంగా నిరూపితమైనది కాదు. లక్షలాది మంది అనుసరిస్తున్నారనే కారణంతో అది సురక్షితమైనదని భావించడం పొరపాటే. అతిగా ఉపవాసాలు చేయడం, చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల తీవ్రమైన డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, స్పృహ కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడవచ్చు. అరుదైన సందర్భాల్లో ఇవి ప్రాణాపాయ స్థితికి కూడా దారితీయవచ్చు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే నిపుణుల పర్యవేక్షణ లేకుండా సోషల్ మీడియా డైట్లను అనుసరించడం ఎంతమాత్రం మంచిది కాదు.
డైట్లు కాదు.. ఆరోగ్యకరమైన అలవాట్లే ముఖ్యం
బరువు తగ్గడానికి మాయా కషాయాలు, అద్భుతమైన డ్రింక్స్, కఠినమైన ఉపవాసాలు అవసరం లేదు. సమయానికి సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, వైద్యులు లేదా అర్హత కలిగిన డైటీViral Diet Trendsషియన్లు సూచించిన ఆహార ప్రణాళికను పాటించడమే ఆరోగ్యకరమైన మార్గం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ మన శరీరానికి సరిపోతుందని భావించకూడదు. వేగంగా బరువు తగ్గించాలనే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. ఎందుకంటే కొన్ని వైరల్ డైట్లు బరువును తగ్గించవచ్చేమో కానీ, అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీయవచ్చు. అందుకే ఏదైనా కొత్త డైట్‌ను ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. బరువు తగ్గడం కంటే ఆరోగ్యంగా ఉండటమే అసలైన లక్ష్యం కావాలి..



