Black Tea Benefits for Weight Loss

బరువు తగ్గాలనుకునేవారు ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో బ్లాక్‌ టీకి ప్రాధాన్యం పెరుగుతోంది. చక్కెర లేకుండా తయారుచేసే బ్లాక్‌ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. చక్కెర కలిపిన టీ, తీపి కాఫీలకు బదులుగా బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల రోజువారీ కేలరీల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. బ్లాక్‌ టీలో పాలీఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా థియాఫ్లేవిన్స్‌, థియారూబిజిన్స్‌ శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్ల వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు.. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యానికి కూడా ఇవి కొంతవరకు తోడ్పడుతాయి. బ్లాక్‌ టీ(Black Tea Benefits for Weight Loss)లో ఉండే కెఫీన్‌ తాత్కాలికంగా శక్తి వినియోగాన్ని స్వల్పంగా పెంచుతుంది. అయితే ఈ ప్రభావాలన్నీ పరిమితమేనని, బరువు తగ్గడంలో బ్లాక్‌ టీ పాత్రపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ టీ తాగితేనే బరువు తగ్గుతారని భావించడం సరికాదంటున్నారు.

ఎలా తాగాలి.. ఎన్ని తాగాలి?
అయితే బ్లాక్ టీ రోజుకు ఎన్ని కప్పులు తాగాలి? అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. బరువు తగ్గడానికి నిర్దిష్టమైన మోతాదు అంటూ ఏదీ లేదని చెప్తున్నారు. కెఫీన్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి ఆరోగ్యవంతులైన పెద్దలు రోజుకు ఒకటి నుంచి మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు. అయితే చక్కెర, తేనె, క్రీమ్‌ కలపకుండా తాగడం మంచిదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలంటే బ్లాక్‌ టీ(Black Tea Benefits for Weight Loss) ఒక్కటే పరిష్కారం కాదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర తప్పనిసరి అని సూచిస్తున్నారు. కేవలం టీ మీద ఆధారపడకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.